వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో కాంగ్రెస్ నుండి తల్లీ, కొడుకులు పోటీ చేయటానికి రెడీ అయిపోయారు. విషయం ఏమిటంటే రాష్ట్ర రాజకీయాల్లో ములుగు ఎంఎల్ఏ సీతక్కంటే తెలియని వారుండరు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు గడచిన మూడు ఎన్నికలుగా సీతక్క అడ్డాగా మారిపోయింది. ఇపుడు సీతక్క కొడుకు సూర్యను కూడా వచ్చే ఎన్నికల్లో పోటీకి దింపటానికి కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. సూర్య ఖమ్మం జిల్లాలోని పినపాక నియోజకవర్గం నుండి పోటీ చేయబోతున్నారట.
పినపాకలో మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలిచిన రేగా కాంతారావు బీఆర్ఎస్ లో చేరిపోయారు. దాంతో ఇక్కడ బలమైన అభ్యర్ధి అవసరమైంది. అప్పుడు సీతక్కను పినపాకకు షిఫ్టవ్వమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ చెప్పారట. రేవంత్ కు సీతక్క బలమైన మద్దతుదారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ములుగును తాను విడిచిపెట్టకుండా పినపాకకు ఆమె కొడుకు సూర్యను పంపారట. అప్పటినుండి నియోజకవర్గంలోనే సూర్య మకాం వేశారు.
గడచిన రెండేళ్ళుగా సూర్యనే నియోజకవర్గం బాధ్యతలంతా చూసుకుంటున్నారు. సీతక్కకు పినపాకలో బంధుత్వాలతో పాటు చాలామందితో మంచి సాన్నిహిత్యముంది. అందుకనే రెగ్యులర్ గా సీతక్క పినపాకలో పర్యటిస్తున్నారు. దాంతో ఆటోమేటిగ్గా సూర్య అందరితోను చొచ్చుకుపోతున్నారు. దాంతో రేపటి ఎన్నికల్లో సూర్యనే రంగంలోకి దింపటానికి రేవంత్ కూడా డిసైడ్ అయిపోయారట. ఇదే విషయాన్ని అధిష్టానంతో చెబితే అక్కడ కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేసినట్లు సమాచారం.
అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటమే నిజమైతే తల్లీ, కొడుకులు కాంగ్రెస్ తరపున పోటీ చేయటం ఖాయమైపోయినట్లే అనుకోవాలి. ఇపుడు బీఆర్ఎస్ తరపున రేపు రేగా కాంతారావుకు టికెట్ దక్కుతుందో లేదో అనుమానమేనట. రేగాపైన అవినీతి ఆరోపణలు కూడా ఎక్కువగా వినబడుతున్నట్లు చెప్పుకుంటున్నారు. దాంతో ఇక్కడ పోటీచేయటానికి గట్టి క్యాండిడేట్ ఎవరున్నారనే విషయమై కేసీయార్ సర్వేలు చేయించుకుంటున్నారు. మరి చివరకు ఎవరిని రంగంలోకి దింపుతారో తెలీటంలేదు. కాంతారావు కారణంగా మాజీ ఎంఎల్ఏ పాయం వెంకటేశ్వర్లు బీఆర్ఎస్ లో ఇమడలేకపోతున్నారు. మరీయనేమి చేస్తారో తెలీదు. పాయం గనుక కాంగ్రెస్ లో చేరిపోతే సూర్య గెలుపు దాదాపు ఖాయమనే అనుకుంటున్నారు.