ఆసక్తికర సన్నివేశం ఒకటి చోటు చేసుకుంది. ఏపీ విపక్ష నేత.. టీడీపీ అధినేత చంద్రబాబు తాను వెళుతున్న దారిలో తన కారును ఆపిన సందర్భంగా ఆయనకు అనుకోని రీతిలో ఎదురైన మద్దతు ఆసక్తికరంగా మారింది. పల్నాడు జిల్లా అమరావతి నుంచి సత్తెనపల్లి వెళుతున్న చంద్రబాబు ధరణి కోట – లింగాపురం మధ్య పొలాల్లో పని చేసుకుంటున్న రైతు కూలీల్ని చూసిన ఆయన తన వాహనాల్ని రోడ్డు పక్కన ఆపారు.
రోడ్డు మీద నుంచి పొలాల్లోకి వెళ్లిన చంద్రబాబు.. అక్కడ పని చేసుకుంటున్న వ్యవసాయ కూలీలతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కినా తమ ఖాతాల్లోకి నగదు పడటం లేదని చెప్పగా.. వచ్చిన కూలి డబ్బులతో కుటుంబం గడుస్తుందా? అని చంద్రబాబు ప్రశ్నించారు. నిత్యవసర వస్తువుల ధరలు పెరిగాయని.. ఖర్చులకు వస్తున్న ఆదాయం సరిపోవటం లేదని వాపోయారు.
ప్రభుత్వం పన్నుల పేరుతో వసూళ్లు చేస్తుందని.. గతంలో కౌలుకార్డుల ద్వారా రుణాలు వచ్చేవని.. ఇప్పుడు రావటం లేదని పేర్కొన్నారు. రాజధాని అమరావతి ఇక్కడే ఉంటే.. తమకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళా కూలీల నోటి నుంచి ఆసక్తికర వ్యాఖ్య ఒకటి వచ్చింది. ఈసారి మీరు ముఖ్యమంత్రి కాకుంటే తాము అడుక్కోవాల్సి వస్తుందని.. తమ జీవితాలు బాగు పడాలంటే మళ్లీ మీరే రావాలంటూ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. దీనికి స్పందించిన చంద్రబాబు.. రైతు కూలీల ఆదాయం పెంచే దిశగా తాను ఆలోచిస్తున్నట్లుగా పేర్కొన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates