నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం కొంతకాలంగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఓ వైపు వైసీపీపై, సీఎం జగన్ పై విమర్శలు గుప్పిస్తోన్న ఆర్ ఆర్ ఆర్…తాను వైసీపీని వీడనంటూ మొండిపట్టు పట్టారు. సొంత పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని లోక్‌సభ స్పీకర్ కు వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేసినా…ఆ దిశగా అడుగులు పడలేదు. ఇక, నిమ్మగడ్డ మొదలు తాజాగా రాజధాని వికేంద్రీకరణ బిల్లు ఆమోదం వరకు…ప్రభుత్వంపై, జగన్ పై విమర్శలు గుప్పిస్తున్న ఎంపీని ఇప్పటివరకూ ఎందుకు సస్పెండ్ చేయలేదన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఏపీలో రాష్ట్రపతి పాలన వచ్చేవరకు జగన్ తెచ్చుకోవద్దంటూ ఉచిత సలహా ఇచ్చినా…ఇంకా జగన్ ఎందుకు మౌనం వహిస్తున్నారో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అదే అలుసుగా…మరోసారి వైసీపీ సర్కార్, జగన్ పై ఆర్ ఆర్ ఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓదార్పు యాత్రతో అధికారంలోకి వచ్చిన జగన్….అమరావతి రైతుల కోసం ఓదార్పు యాత్ర చేయాలని, సాక్షిని కాకుండా మనస్సాక్షిని నమ్మాలంటూ జగన్ కు రఘురామకృష్ణంరాజు హితబోధ చేశారు.
అమరావతి కోసం ప్రాణత్యాగం చేసిన వారి కుటుంబాల్ని పరామర్శించి మంచి పేరు తెచ్చుకోవాలంటూ జగన్ కు రఘురామకృష్ణంరాజు ఉచిత సలహా ఇచ్చారు. ఈ నెల నుంచి రూ.250 పెన్షన్ పెంచుతానని చెప్పి మాట తప్పారని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఈ ఉదంతం నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో వేల కోట్లతో 3 రాజధానులు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. మూడు రాజధానుల కాన్సెప్ట్‌లో అసలు అర్థమే లేదని, అమరావతి నుంచి విశాఖకు రాజధానిని తరలించి…అధికార వికేంద్రీకరణ, మూడు రాజధానులంటూ ముసుగేశారని సెటైర్ వేశారు. మహిళా రైతులు తలచుకుంటే రాజధాని తరలింపు ఆగిపోతుందనీ, వారికి తమందరి మద్దతు ఉంటుందని షాకింగ్ కామెంట్స్ చేశారు. రాజధాని కోసం కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలను రాజీనామా చేయాలన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ సహేతుకమైనదేనని రఘురామకృష్ణంరాజు చెప్పారు.
కానీ, రాజీనామా కన్నా రాజీలేని పోరాటం చేస్తే బాగుంటుందని అన్నారు. బీటెక్ చదివి బీటెక్ నే తన ఇంటి పేరుగా మార్చుకున్న బీటెక్ రవి, తన పదవికి రాజీనామా చేయడంలో అర్థంలేదన్నారు. మండలి సభ్యుడిగా ఉంటూనే పోరాడాలన్నారు. రవికి భవిష్యత్తులో భద్రతపరమైన సమస్యలు ఏర్పడవచ్చని, ఎంపీనైన తనకు కేంద్ర బలగాల భద్రత వస్తుందన్న నమ్మకమైనా ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానిపై రిఫరెండం నిర్వహించే ఆలోచన ప్రభుత్వానికి లేదని, ఎమ్మెల్యేలంతా తమ నియోజకవర్గాల ప్రజల మనోభావాలు తెలుసుకోవాలని అన్నారు.కనీసం విశాఖలో అయినా 3 రాజధానుల డిమాండ్‌తో ఉప ఎన్నికలకు వెళ్ళే దైర్యముందా? అని జగన్ కు సవాల్ విసిరారు. రాష్ట్రంలో శానిటైజర్ తాగి చనిపోతున్నవారి సంఖ్య…కరోనా మరణాల్ని మించిపోయేలా ఉందని ఎద్దేవా చేశారు. సన్నబియ్యం విషయంలో ‘సాక్షి తప్పు రాసిందంటూ అసెంబ్లీలో జగన్ స్వయంగా అంగీకరించారని, ఇకపై అయినా…జగన్ సాక్షి విశ్వసనీయతను కాకుండా….మనస్సాక్షిని నమ్మాలని సెటైర్ వేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates