ఆంధ్రప్రదేశ్లో జగన్ సర్కారు పట్టుబట్టి అమరావతి నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధానిని తరలిస్తూ.. మూడు రాజధానుల ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసుకోవడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. మెతకగా వ్యవహరిస్తున్నారని.. దీన్ని గట్టిగా వ్యతిరేకించట్లేదని కొన్ని వర్గాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ముందు ఆచితూచి మాట్లాడిన పవన్.. తాజాగా కొంచెం ఘాటుగానే మాట్లాడాడు. మూడు రాజధానులపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చర్చ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. అమరావతి నుంచి రాజధానిని తరలించడాన్ని నిరసిస్తూ.. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలందరూ తమ పదవులకు రాజీనామా చేయాలని పవన్ డిమాండ్ చేశాడు.
అలాగే వైసీపీ ఎమ్మెల్యేలకూ పవన్ రాజీనామా సవాలు విసిరాడు. తమ ప్రాంతం నుంచి రాజధానిని తరలిస్తున్నందుకు వైకాపాకు చెందిన కృష్ణా, గుంటూరు వైకాపా ఎమ్మెల్యేలూ రాజీనామా చేయాలన్నాడు. అమరావతిపై చిత్తశుద్ధి ఉంటే వీళ్లందరూ రాజీనామాల తర్వాత ప్రత్యక్ష పోరాటంలోకి రావాలని పవన్ డిమాండ్ చేశాడు.
రాజధాని వికేంద్రీకరణ పేరిట మూడు ప్రాంతాల మధ్య చిచ్చు రేపుతున్నారన్న పవన్.. రైతు కన్నీరుపై రాజధాని నిర్మాణం వద్దని మొదట్నుంచీ చెబుతున్నామన్నాడు. జగన్ సర్కారు ప్రభుత్వ వైఫల్యాలు కప్పి పుచ్చుకునేందుకే రాజధాని క్రీడ మొదలుపెట్టారని ఆరోపించాడు. రాజధాని వికేంద్రీకరణపై న్యాయకోవిదులు, నిపుణులతో చర్చిస్తామని పవన్ చెప్పాడు. మరి సహేతుకంగానే అనిపిస్తున్న పవన్ ‘రాజీనామా’ ఛాలెంజ్ పట్ల టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు ఎలా స్పందిస్తారో చూడాలి.