చంద్రబాబు ఐడియాలజీ కాన్సెప్ట్ కు విశేష స్పందన

టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 73వ పుట్టిన రోజును జరుపుకుని 74వ పడిలోకి అడుగుపెట్టారు. ఆయన జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు ఒక దసరాలా, ఒక దీపావళిలా, క్రిస్మస్ లా, ఒక రంజాన్ లా జరుపుకున్నారు. వాడవాడలా కేకులు కట్ చేశారు. చంద్రబాబు కూడా మార్కాపురం పట్టణంలో వేడుకలకు హాజరయ్యారు. తనకు పుట్టిన రోజు కంటే ప్రజా సంక్షేమమే ముఖ్యమని ఆయన చెప్పకనే చెప్పారు.

చంద్రబాబు తన పుట్టిన రోజు సందర్భంగా పార్టీకి, రాష్ట్రానికి భవిష్యత్ దర్శినిని ఆవిష్కరించారు.తెలుగు ప్రజల్లో ఆర్థిక సమానత్వాన్ని సాధించే దిశగా ఐడియాలజీ కాన్సెప్ట్ ను ఆయన ప్రకటించారు. పేదలను సంపన్నుల స్థాయికి అభివృద్ధి చేయడమే ఐడియాలజీ కాన్సెప్ట్ ప్రధాన లక్ష్యమని ఆయన ప్రస్తావించారు. ఇంతవరకు జరిగిన అభివృద్ధిని వివరిస్తూ దాని ఆధారంగా ఐడియాలజీ కాన్సెప్ట్ విజయవంతం అవుతుందని ఆకాంక్షించారు. ఎకరం.. రెండెకరాలు ఉన్న రైతుల భూముల కూడా కోటి రూపాయల విలువ పలకడం అభివృద్ధికి నిదర్శనమన్నారు.

అభివృద్దికి ఒక రోజులో సాధ్యం కాదన్నది చంద్రబాబు చెప్పిన నిజం. 15 నుంచి 20 ఏళ్ల పాటు శ్రమిస్తేనే అభివృద్ధి ఫలాలు మన చేతికి అందుతాయని ఆయన గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఓడరేవులు, నగరాలను అవకాశాల గనిగా మార్చితే తన ఐడియాలజీ కాన్సెప్ట్ కల నెరవేరుతుందని చంద్రబాబు అన్నారు.

సంపన్నులు పేదలకు మెంటర్లుగా నిలిస్తే ఐడియాలజీ కాన్సెప్ట్ ను విజయవంతం చేయడం కష్టమేమీ కాదని చంద్రబాబు అన్నారు. సమిష్టి బాధ్యత తీసుకుంటే అభివృద్ధి తానంతట అదే జరుగుతుందని తన అభిప్రాయంగా చెప్పారు. ప్రభుత్వం కూడా తన వంతుగా కుటుంబాల వాస్తవ స్థితిగతులు అర్థం చేసుకుని మానవ వనరుల అభివృద్ధి, ఆర్థిక స్థితిగతులను మెరుగు పరచడంపై దృష్టి పెట్టాలన్నారు. దీని కోసం టీడీపీ ప్రత్యేక సాఫ్ట్ వేర్ తయారు చేయించే పనిలో ఉంది. అధికారానికి వచ్చిన తర్వాత ఆ సాప్ఠ్ వేర్ ను ఉపయోగించి ప్రజల జీవితాలను మెరుగు పరచాలనుకుంటోంది. అధికారానికి వచ్చిన తర్వాత ప్రత్యేక పాలసీని కూడా రూపొందిస్తారు.

తెలుగు వారు ఎక్కడ ఉన్నా నెంబర్ వన్ గా ఉండలన్నది తన ఆలోచనగా చంద్రబాబు చెప్పుకున్నారు. గతంలో జన్మభూమి కార్యక్రమం ద్వారా సొంత గ్రామాలను అభివృద్ధి చేసుకున్నామని.. ఇప్పుడు ప్రణాళికాబద్ధంగా పనిచేయడం ద్వారా ప్రజల జీవితాలను సమూలంగా మార్చవచ్చని తెలిపారు. టెక్నాలజీ ద్వారా కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకుని.. ఐడియాలజీతో, ప్రణాళికతో పనిచేయడం ద్వారా వారి జీవితాల్లో మార్పు తెస్తానన్నారు. ఈ కాన్సెప్ట్‌ విజయవంతానికి ఐటీరంగ ప్రతినిధులు ముందుకు రావాలని పిలుపిచ్చారు. పిల్లలు, మహిళలతో ఐడీయాలజీ కాన్సెప్ట్ విడుదల చేయించి చంద్రబాబు తన ప్రత్యేకతను చాటుకున్నారు. చంద్రబాబు ప్రతిపాదించిన ఐడియాలజీ కాన్సెప్ట్ ను వేర్వేరు రంగాల వారు, వృత్తి నిపుణలు స్వాగతిస్తున్నారు…