టీడీపీకి అంబ‌టి రాయుడు షాక్

అంబ‌టి రాయుడు.. క్రికెట్ పాలో అయ్యేవారికి ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేని పేరు. అంత‌ర్జాతీయ క్రికెట్లో, అలాగే ఐపీఎల్‌లో ఎన్నో మెరుపు ఇన్నింగ్స్‌లతో మంచి పాపులారిటీనే సంపాదించాడు ఈ టాలెంటెడ్ క్రికెట‌ర్. 37 ఏళ్ల వ‌య‌సులో ప్ర‌స్తుతం ఐపీఎల్‌లో చెన్నైకి ఆడుతూ. కెరీర్ చ‌ర‌మాంకంలో ఉన్న అత‌ను త్వ‌ర‌లో ఆట‌కు టాటా చెబుతాడ‌నే అంచ‌నాలున్నాయి.

క్రికెట్ నుంచి తప్పుకోగానే అత‌ను రాజ‌కీయాల్లోకి వ‌స్తాడ‌నే సంకేతాలు బ‌లంగా వినిపిస్తున్నాయి. వ‌చ్చే ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అత‌ను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడ‌ని.. తెలుగుదేశం పార్టీతో అత‌ను ట‌చ్‌లో ఉన్నాడ‌ని ఇటీవ‌ల జోరుగావార్త‌లు వ‌చ్చాయి. రాయుడికి టికెట్ ఇచ్చే విష‌యంలో టీడీపీ కూడా సానుకూలంగానే ఉంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. మ‌రోవైపు జ‌న‌సేన సైతం రాయుడిని ఆక‌ర్షించే ప్ర‌య‌త్నంలో ఉన్న‌ట్లు కూడా ఊహాగానాలు వినిపించాయి.

క‌ట్ చేస్తే.. అంబ‌టి రాయుడు బుధ‌వారం వేసిన ఒక ట్వీట్‌తో అంద‌రికీ దిమ్మ‌దిరిగిపోయింది. ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఒక స‌భ‌లో చేసిన ప్ర‌సంగం తాలూకు వీడియోను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక హ్యాండిల్లో పోస్ట్ చేయ‌గా.. దానిపై రాయుడు స్పందిస్తూ.. గొప్ప ప్ర‌సంగం. మ‌న ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ గారు.. మ‌న రాష్ట్రంలో ప్ర‌తి ఒక్క‌రూ మీ మీద పూర్తి న‌మ్మ‌కం క‌లిగి ఉన్నారు సార్ అని పేర్కొన్నాడు.

టీడీపీలో చేర‌తాడ‌నుకున్న వాడు.. ఇలా జ‌గ‌న్‌ను పొగుడుతూ ట్వీట్ వేసేస‌రికి నెటిజ‌న్లు షాక‌య్యారు. టీడీపీ వాళ్లతో పాటు జ‌నసైనికులు కూడా అత‌డిని తీవ్రంగా విమ‌ర్శిస్తూ పోస్టులు పెట్టారు. ఐతే టీడీపీతో ట‌చ్‌లోకి వెళ్లాక‌.. ఆ పార్టీ నేత‌లు త‌న‌ను స‌రిగా ప‌ట్టించుకోని నేప‌థ్యంలో వారికి హెచ్చ‌రిక‌లు జారీ చేసేలా రాయుడు ఇలా ట్వీట్ వేశాడ‌నే మాట రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.