వ‌చ్చే పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ఢిల్లీ గ‌ద్దె మ‌న‌దే: కేసీఆర్

వ‌చ్చే పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో(2024) బీఆర్ఎస్ అద్భుత‌మైన విజ‌యం సాధిస్తుంద‌ని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ విజ‌యం అందుకుని.. ఢిల్లీ గ‌ద్దెనెక్క‌డం ఖాయ‌మ‌ని చెప్పారు. ఇది కొంద‌రికి న‌చ్చ‌క‌పోవ‌చ్చ‌ని.. అయినా.. జ‌రిగేది ఇదేన‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. దేశానికే దిక్సూచిలా, సమానత్వ స్ఫూర్తిని నిత్యం రగిలించేలా… హైదరాబాద్‌ సాగర తీరాన‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ అతిపెద్ద విగ్రహం కొలువుదీరింద‌న్నారు. అంబేద్క‌ర్‌ కాంస్య ప్రతిమను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.

అంబేద్క‌ర్‌ మనవడు ప్రకాశ్‌ అంబేడ్కర్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఉద్వేగ భ‌రితంగా మాట్లాడారు. సభా వేదికపై జైభీమ్‌ అంటూ ప్రసంగం ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. అంబేద్క‌ర్‌ రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 ఏళ్లు దాటిందన్నారు. ఏటా జయంతి జరుపుకుంటున్నామని.. అంబేద్క‌ర్‌ విశ్వ మానవుడు అని కొనియాడారు. అంబేద్క‌ర్ సిద్ధాంతం విశ్వజనీనం, సార్వజనీనమని కొనియాడారు. ఆయన కలలు సాకారం కావాల్సిన అవసరం ఉందని చెప్పారు.

మ‌నదే కేంద్రం!!

‘వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ ప్రభుత్వమే ఢిల్లీలో కొలువు తీరుతుంది. ఈ మాటలు కొందరికి మింగుడు పడకపోవచ్చు. మహారాష్ట్రలో బీఆర్ఎస్కు గొప్ప స్పందన వస్తోంది. మహారాష్ట్ర తరహాలోనే దేశమంతా స్పందించే రోజు వస్తుంది. దేశమంతా ఏటా 25 లక్షల కుటుంబాలకు దళితబంధు ఇచ్చే రోజు వస్తుంది. దేశాన్ని సరైన మార్గంలో నడిపించేందుకు చివరి రక్తబొట్టు వరకు కృషిచేస్తా. అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

ఎవ‌రో అడిగితే పెట్ట‌లేదు!
ఎవరో అడిగార‌ని.. హైద‌రాబాద్ న‌డిబొడ్డున‌ అంబేద్క‌ర్‌ విగ్రహం పెట్టలేదని కేసీఆర్ అన్నారు. ఆయ‌న ప‌ట్ల ఉన్న విశాల ద్రుక్ఫ‌తంతోనే విగ్ర‌హం ఏర్పాటు చేశామ‌న్నారు. ‘సచివాలయానికి కూడా అంబేద్క‌ర్‌ పేరు పెట్టుకున్నాం. ఇక్కడికి దగ్గరలోనే అమరవీరుల స్మారకం ఉంది. అంబేద్క‌ర్‌ విగ్రహం సమీపంలోనే బుద్ధుడి విగ్రహం ఉంది. అంబేడ్కర్‌ సిద్ధాంతాలు స్మరణకు వచ్చేలా ఏర్పాట్లు చేశాం. ఇది విగ్రహం కాదు.. విప్లవం. తెలంగాణ కలలు సాకారం చేసుకునే చిహ్నం ఈ విగ్రహం. విగ్రహ ఏర్పాటుకు కృషిచేసిన అందరికీ ధన్యవాదాలు.’ అని సీఎం కేసీఆర్ చెప్పారు.

51 కోట్ల‌తో ప్ర‌త్యేక నిధి!

రాజ్యాంగ నిర్మాత‌ పేరిట అవార్డు ఇవ్వాలని కత్తి పద్మారావు సూచించారని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. త్వ‌ర‌లోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డులు ఇవ్వబోతోందని చెప్పారు. అవార్డు కోసం రూ.51 కోట్ల నిధి ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఏటా అంబేడ్కర్‌ జయంతి రోజున అవార్డు ప్రదానం చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఎస్సీల అభ్యున్నతి కోసం తెచ్చిన కార్యక్రమం దళితబంధు అని, ఇప్పటివరకు రాష్ట్రంలో 50 వేల మందికి దళితబంధు అందిందని తెలిపారు. ఈ ఏడాది మరో 1.25 లక్షల మందికి దళితబంధు అమలు చేస్తామని కేసీఆర్ వివ‌రించారు.