అంబటి నిర్వేదం

Ambati Rambabu

అంబటి రాంబాబు నీటి పారుదల శాఖామంత్రి… ప్రత్యేర్థులు ఆయన్ను నోటి పారుదల శాఖామంత్రి అని కూడా పిలుస్తుంటారు. ఎందుకంటే ఆయన ఎక్కువ మాట్లాడతారు. అవసరం ఉన్నా లేకపోయినా ప్రత్యర్థులను తిట్టి పోస్తుంటారు. అలాంటి ఫోర్సున్న అంబటి.. ఇప్పుడు ఎందుకో వేదాంత ధోరణిలోకి వెళ్లిపోయారని అనుచురులు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు..

సత్తెనపల్లి వైసీపీ టికెట్ తనకు గ్యారెంటీ కాదని అంబటి స్వయంగా చెప్పుకుంటున్నారట. ఈ దిశగా ఆయన నిర్వేదంలోకి వెళ్లిపోయారట. 2024లో తామెవ్వరికీ టికెట్ గ్యారెంటీ లేదని అంబటి చెప్పుకుంటున్నారట. అదేమంటే అది అంతేనని అంటున్నారట.

2014లో సత్తెనపల్లి నుంచి ఓడిపోయిన అంబటి 2019లో గెలిచారు. మంత్రివర్గ విస్తరణలో ఆయనకు కీలక జలవనసరు ల శాఖ దక్కింది. 2024లో టికెట్ ఉండదన్న షరతు మీదే అంబటికి మంత్రి పదవి ఇచ్చారని అప్పట్లో చర్చ జరిగింది. ఇప్పుడు నర్మగర్భంగా అంబటి అదే విషయాన్ని అనుచరులు, అభిమానుల వద్ద చెప్పుకుంటున్నారని వైసీపీ జనం అంటున్నారు.

టికెట్ రాదని తెలిసినా అధిష్టానం ఆదేశాల మేరకు గడప గడపకు తిరుగుతున్నామని అంబటి చెబుతున్నారు. అయితే తాజాగా నిర్వహిస్తున్న పీపుల్స్ సర్వేలో అంబటి ఆసక్తిగా పాల్గొనడం లేదని నియోజకవర్గంలో పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు.పనంతా కింది స్థాయి కేడర్ కు, వాలంటీర్లకు అప్పగించి ఆయన మౌనం వహిస్తున్నారని అంటున్నారు. అంబటి మీ వీధికి వస్తున్నారని ముందుగా పార్టీ వాళ్లు ప్రచారం చేస్తున్నారు. దానితో మంత్రిని చూసేందుకు జనం వేచి ఉంటున్నారు. అయితే అంబటి రాకుండానే ఓ పది మంది గుంపుగా వచ్చి సర్వే పూర్తి చేసుకుని వెళ్లిపోతున్నారు. దానితో రాజకీయాల పట్ల అంబటికి ఇంట్రస్ట్ తగ్గిందని గుస గుసలు వినిపిస్తున్నాయి….