కేసీయార్ కు ఏపీలో షాక్ తప్పదా ?

తెలంగాణ లో అధికారంలో ఉండికూడా పార్టీ గుర్తుతో బీఆర్ఎస్ నానా అవస్థలు పడుతోంది. అలాంటిది రాబోయే ఎన్నికల్లో పార్టీగుర్తు లేకపోతే ఇంకెన్ని సమస్యలు ఎదురవుతుందో ? ఇంతకీ విషయం ఏమిటంటే ప్రాంతీయపార్టీ టీఆర్ఎస్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ గా మారిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా కేసీయార్ కేంద్ర ఎన్నికల కమీషన్ దగ్గర రిజిస్టర్ చేయించారు. రిజిస్టర్ పార్టీకి రికగ్నిషన్ దక్కాలంటే కమీషన్ లెక్కల ప్రకారం ఫిట్టవాలి.

కమీషన్ లెక్కలు ఏమిటంటే వివిధ రాష్ట్రాల్లో నిర్దిష్టమైన సీట్లు, ఓట్లు తెచ్చుకోవాలి. ఇపుడా లెక్కలు అనవసరం కానీ కమీషన్ తాజా నిర్ణయం ప్రకారం బీఆర్ఎస్ తెలంగాణ లో మాత్రమే రాష్ట్రపార్టీ. ఏపీలో ఇప్పటివరకు ఒక్క ఎన్నికలోను పోటీచేయలేదు కాబట్టి రాష్ట్రపార్టీగా గుర్తింపు రద్దుచేసింది. పోటీయే చేయలేదు కాబట్టి ఓట్లు, సీట్లనే ప్రస్తావనే లేదు. ఇపుడు సమస్య ఏమివచ్చిదంటే మొదటినుండి బీఆర్ఎస్ ను పార్టీ గుర్తు కారుకు ఇబ్బందులు ఎదురవుతునే ఉన్నాయి.

కారును పోలిన ట్రాక్టర్, జీపు, హెలికాప్టర్, ఆటో లాంటి గుర్తులు పీడకలగా వెంటాడుతున్నాయి. కారుకు పడాల్సిన ఓట్లలో కొన్ని పై గుర్తులకు పడుతున్నాయి. దాంతో కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్ధులు తక్కువ మార్జిన్ తో ఓడిపోయారు. ఈ విషయంలో కేసీయార్ ఎంత మొత్తుకున్నా ఉపయోగం లేకపోయింది. అధికారంలో ఉన్న తెలంగాణాలోనే ఇబ్బంది పడుతున్నపుడు ఏపీలో సంగతి చెప్పేదేముంది ? ఏపీలో బీఆర్ఎస్ గుర్తింపులేని పార్టీ కాబట్టి కారు గుర్తు కావాలంటే దొరకదు. ఎందుకంటే ఏపీలో కారు గుర్తు ఫ్రీ సింబల్.

మొదట నామినేషన్ వేసిన వాళ్ళు ఏ గుర్తును కోరుకుంటే కమీషన్ ఆ గుర్తును ఇవ్వాల్సిందే. కాబట్టి కారు గుర్తు బీఆర్ఎస్ కు వస్తుందనే గ్యారెంటీలేదు. మరీ పరిస్ధితుల్లో బీఆర్ఎస్ ఏపీ ఎన్నికల్లో ఏ సింబల్ తో పోటీచేస్తుంది ? పోటీచేసిన నియోజకవర్గాల్లో ఒక్కో అభ్యర్ధి ఒక్కో గుర్తుమీద పోటీచేయాల్సొచ్చినా ఆశ్చర్యంలేదు. మరపుడు కేసీయార్ ఆశిస్తున్న ఓట్లు, సీట్లు దక్కే అవకాశాలు చాలా తక్కువ. తాజా పరిణామాల నేపధ్యంలో కేసీయార్ ఏమిచేస్తారో చూడాల్సిందే.