కొమ్మాలపాటి దూకుడు…

ఓడిపోయినందుకు ఆయన మౌనంగా కూర్చోలేదు. ఇంకెంతకాలంలే అని రాజకీయ సన్యాసం చేయలేదు. ప్రజా సేవకు అంకితం కావాలంటే పోగొట్టుకున్న చోటే వెదుక్కోవాలని ఆయన డిసైడయ్యారు. జనం కోసం అధికార వైసీపీని ఎదుర్కోవడంలో ఆయన దూకుడును పెంచారు.. ఆయనే ఉమ్మడి గుంటూరు, ప్రస్తుతం పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్

గుంటూరు జిల్లా టీడీపీలో కొమ్మాలపాటి కీలక నేత. పార్టీలో క్రియాశీలంగా ఉంటూ ప్రతీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అధినేత చంద్రబాబు ఆదేశానుసారం ప్రతీ పని చేస్తారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయినా ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే నంబూరు శంకర్ రావు కంటే సమర్థంగా జనంలో పనిచేస్తున్నారు. వైసీపీ పేరుకే గడప గడపకు కార్యక్రమం నిర్వహిస్తున్నా ప్రతీ ఇంటికి వెళ్లి సమస్యలు తెలుసుకుంటున్నది మాత్రం కొమ్మాలపాటేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే కంటే ఆయనే పాపులర్..

కొమ్మాలపాటి శ్రీధర్ ఇప్పుడు వైసీపీని సవాలు చేస్తున్నారు. నియోజకవర్గానికి టీడీపీ, వైసీపీలో ఎవరు ఎక్కువ చేశారు, ఎవరు అవినీతికి దిగారనే విషయంపై చర్చకు ఇరు వర్గాల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు మొదలయ్యాయి. నియోజకవర్గం పరిధిలో ఉండే అమరావతి అమరేశ్వర స్వామి ఆలయం సాక్షిగా చర్చకు రావాలని తొడకొట్టుకున్నారు. ఇలాంటి చర్చల వల్ల ఉద్రిక్తతలు తలెత్తే ప్రమాదం ఉందని భావించి పోలీసులు వారికి అనుమతించలేదు. అమరావతి పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు.

పల్నాడులో జిల్లాలో టీడీపీని నడిపిస్తున్న ఇద్దరు నేతల్లో కొమ్మాలపాటి శ్రీధర్ ఒకరు. మరో నేత గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అని చెప్పాలి. శ్రీధర్ కు టీడీపీ కేడర్ లో మంచి పట్టు ఉంది. తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకుని ప్రజల కోసం పనిచేస్తున్నారు. 2024లో టికెట్ దక్కే అవకాశం ఉన్న నేతల్లో ఆయన కూడా ఒక్కరు.

ప్రస్తుతం కొమ్మాలపాటి చేసిన సవాలును నిరూపించేందుకు పోలీసులు అనుమతించకపోవచ్చు. కాకపోతే కొమ్మాలపాటి సమర్థత ఏమిటో జనానికి తెలుసని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అధినేత చంద్రబాబు మద్దతు కూడా ఆయనకు ఉందని అంటున్నారు..