దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన ముగిసింది. ప్రధాని కుర్చీలో కూర్చున్న గడిచిన తొమ్మిదేళ్లలో ఆయన తెలంగాణకు వచ్చిన సందర్భాల కంటే ఆర్నెల్ల కంటే తక్కువ వ్యవధిలో వచ్చిన సందర్భాల్లే ఎక్కువ. తాజా పర్యటనతో కలిపితే ఆయన ఐదుసార్లు వచ్చారు. తాము ఏదైనా రాష్ట్రాన్ని టార్గెట్ చేస్తే.. అక్కడకు తరచూ వెళ్లే సంప్రదాయాన్ని తెలంగాణలోనూ ఫాలో అయ్యారు మోడీ. కాకుంటే.. జమ్ముకశ్మీర్.. పశ్చిమ బెంగాల్ తో పోలిస్తే.. తెలంగాణకు ఆయన వచ్చింది తక్కువే.
కేంద్రానికి.. తెలంగాణ రాష్ట్ర సర్కారుకు రాజకీయ రగడ నెలకొన్న నేపథ్యంలో ఒకరిపై ఒకరు మాటల పంచ్ లు వేసుకోవటం తెలిసిందే. ఇవన్నీ ఎలా ఉన్నా.. మోడీని మాత్రం ఒక విషయంలో మెచ్చుకోవాలి. సీఎం కేసీఆర్ తో ఎంత పంచాయితీ ఉన్నా.. రైల్వే శాఖ నిర్వహించిన బహిరంగ సభలో మాత్రం ఆయనకంటూ ఒక కుర్చీని వేసి ఉంచటం ద్వారా.. తన పెద్దరికాన్ని ప్రదర్శించారని చెప్పాలి. అదే సమయంలో సీఎం కేసీఆర్ మాత్రం తనకు నచ్చని విషయాల్లో ఎంతటి కరకుతనాన్ని ప్రదర్శిస్తారో.. ప్రధాని మోడీ విషయంలోనూ అంతే కరకుతనాన్నిప్రదర్శించారు.
ప్రధాన మంత్రి హోదాలో ఉన్న నేత ఏదైనా రాష్ట్రానికి వెళ్లినప్పుడు.. అక్కడి ముఖ్యమంత్రి ఎయిర్ పోర్టుకు రావటం.. రిసీవ్ చేసుకోవటం.. తిరిగి వెళ్లేటప్పుడు వీడ్కోలు పలకటం చేస్తారు. ప్రధానితో తనకున్న పంచాయితీ నేపథ్యంలో తనకు బదులుగా తన మంత్రివర్గంలోని సభ్యుడైన తలసాని శ్రీనివాస్ యాదవ్ ను పంపటం తెలిసిందే. తాజా పర్యటనతో కలిపి మొత్తం ఐదు దఫాలు ఆయనే ప్రధాని మోడీని రిసీవ్ చేసుకోవటం.. వీడ్కోలు పలకటం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో వందే భారత్ రైలును పచ్చజెండా ఊపి ప్రారంభించిన తర్వాత.. పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన సభలోని వేదిక మీద.. సీఎం కేసీఆర్ కు ఒక కుర్చీని ఏర్పాటు చేసి ఉంచటం గమనార్హం.
ఈ అంశం వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతోంది. ఇదిలా ఉంటే.. ప్రధాని మోడీ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు రాలేదంటూ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. ‘అంత ముఖ్యమైన పని ఏముంది? ఏం పీకుతున్నారు? ఇవాల్టి ముఖ్యమంత్రి షెడ్యూల్ బయటపెట్టాలి?’’ అంటూ ప్రశ్నలు సంధించారు. అంతేకాదు.. తాను ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం ఎదురుచూశానని.. ఆయన్నుసన్మానించేందుకు శాలువ కూడా తెచ్చానంటూ సెటైర్లు పేల్చారు.
తెలంగాణలో రూ.11 వేల కోట్లతో డెవలప్ మెంట్ పనులు చేశారని.. రాష్ట్రాన్ని డెవలప్ చేసేందుకు రాష్ట్రం సహకరించటం లేదంటూ ఆరోపించారు. దేశ ప్రధాని రాష్ట్రానికి వస్తే కేసీఆర్ ఎందుకు రాలేదని ప్రశ్నించిన బండి.. కేసీఆర్ డెవలప్ మెంట్ కు నిరోధకుడిగా మారారని వ్యాఖ్యానించారు. మరి.. బండి వ్యాఖ్యలకు సీఎం కేసీఆర్ రియాక్టు అవుతారా? లేదంటే ఎప్పటిలానే మంత్రి కేటీఆర్ బదులిస్తారా? అన్నది చూడాలి.