కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులతో రాష్ట్రంలోని ప్రభుత్వం కలిసి రావడం లేదని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర్ పేరు ఎత్తకుండానే ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందని అన్నారు. అంతా అవినీతి మయం అయిపోయిందని పేర్కొన్నారు. నిజాయితీగా పనిచేస్తసున్నవారంటే.. పాలకులకు భయం పట్టుకుందని తెలిపారు.
తెలంగాణలో కుటుంబ పాలనలో అవినీతి పెరిగిందని చెప్పారు. ఇలాంటి వారికి సమాజం అభివృద్ధి పట్టడం లేదని ప్రధాని విమర్శలు గుప్పించారు. అన్నివిషయాల్లోనూ కేంద్రంతో ఘర్షణాత్మక వైఖరిని అవలంబిస్తున్నారని అన్నారు. కుటుంబ పాలనను ప్రశ్నించడాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారని వ్యాఖ్యానించారు. వారిని ఎదిరించకూడదని భావిస్తున్నారని ప్రధాని పేర్కొన్నారు. కొందరు వారు స్వలాభం చూసుకుంటున్నారని ప్రధాని వ్యాఖ్యానించారు.
ఇలాంటి వారితో(కేసీఆర్) తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రధాని హెచ్చరించారు. స్వార్థంతో కూడుకున్న పాలన సాగుతోందని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజలు సాధ్యమైనంత త్వరగా కళ్లు తెరవాలని సూచించారు. అవినీతిని ఎవరూ పట్టించుకోరాదని.. ఎవరూ వారిని ప్రశ్నించరాదని.. అనుకుంటున్నారని.. కానీ, అలా కుదరదని అన్నారు. కుటుంబ పాలనతో సమాజాన్ని.. ప్రజలను నియంత్రించాలని అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
అవినీతి రహితంగా కేంద్రం ముందుకు సాగుతోందని ప్రధాని చెప్పారు. రైతులు, విద్యార్థులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ ద్వారా ఆయా పథకాల నిధులను బదిలీ చేస్తోందన్నారు. అవినీతికి పాల్పడే వారు ఎంతటివారైనా.. చర్యలు తప్పవని.. వారిని నియంత్రించడం.. తప్పదని హెచ్చరించారు. అవినీతి పరులకు పోరాడాల్సిందేనని చెప్పారు. “అవినీతి పరులపై పోరాడాలా.. వద్దా.. మీరే చెప్పాలి?” అని ప్రశ్నించారు.