జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన వరుసగా రెండో రోజు కూడా కొనసాగుతూనే ఉంది. అదే సమయంలో కేంద్రలోని కీలక నేతలు, కేంద్ర మంత్రులతో ఆయన వరుసగా భేటీ అవుతున్నారు. ఇప్పటికే కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో, ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మురళీధరన్‌తో సమావేశమైన ఆయన.. మంగళవారం మరికొందరితో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ వరుస భేటీలు రాష్ట్రంలో ఉత్కంఠను రేకెతిస్తున్నాయి.
పవన్ కల్యాణ్.. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ నుంచి సోమవారం ఢిల్లీకి చేరుకున్నారు. బీజేపీ ముఖ్య నేతలతో, కేంద్ర మంత్రులతో భేటీలు అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న తాజా రాజకీయ పరిస్థితులపై, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల గురించి, భవిష్యత్ కార్యాచరణతోపాటు ఇతర అంశాలపై చర్చిస్తున్నట్లు జనసేన వర్గాలు తెలిపాయి. అదే విధంగా.. పోలవరం ప్రాజెక్టు పూర్తి, నిధులు.. సమస్యలు.. పునరావాస ప్యాకేజీ వంటి అంశాలపైనా.. పవన్ చర్చించినట్టు సమాచారం.
జనసేనానితో పాటు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సైతం చర్చల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా పలువురు మీడియా ప్రతినిధులు.. పవన్ కల్యాణ్‌ను కలిసి వరుస భేటీల గురించి ప్రశ్నించారు. దీంతో ఆయన భారతీయ జనతా పార్టీ ముఖ్యనేతలందరినీ కలిసిన తర్వాత భేటీల్లో చర్చిస్తోన్న అంశాలతోపాటు అన్ని విషయాల గురించి మాట్లాడతానని చెప్పారు.
వ్యూహం ఇదేనా?
పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన వెనుక అసలు వ్యూహం.. పొత్తులేనని అంటున్నారు పరిశీలకులు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు పెట్టుకుంటే ఒనగూరే ప్రయోజనాలు.. అధికారంలోకి వచ్చే అవకాశం వంటివాటిని వివరించి.. టీడీపీకి దూరంగా ఉన్న బీజేపీని ఆయన ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. అంతేకాదు.. మూడు పార్టీలు కలిస్తే.. ఏపీలో అధికారం చేపట్టడం పెద్ద కష్టం కాదని కూడా పవన్ తేల్చి చెప్పనున్నట్టు పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
ఆది నుంచి కూడా వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంను చీలకుండా చూస్తానని పవన్ చెబుతున్నారు. ఇది జరగాలంటే.. బీజేపీ-టీడీపీ-జనసేన మూడు పార్టీలు కలిసిపోటీ చేయాల్సిన అవసరం ఉందని పవన్ లెక్కలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే గతంలోనే రోడ్ మ్యాప్ కోసం పవన్ ప్రయత్నించారు.కానీ, బీజేపీ మౌనం వహించింది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు మరో ఏడాది సమయమే ఉన్న క్రమంలో తాజాగా బీజేపీని ఒప్పించి.. పొత్తుల దిశగా అడుగులు వేయించే బాధ్యతను పవన్ తీసుకున్నాడని అంటున్నారు పరిశీలకులు.