ఇక్కడ ప్రత్యర్ధులు ఫైనలైపోయారా ?

చంద్రగిరిలో ప్రత్యర్ధులు ఫైనల్ అయిపోయారు. వచ్చే ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుండి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పోటీ చేయడం ఖాయమైపోయింది. తనకు బదులు కొడుకు మోహిత్ రెడ్డి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని ఎంఎల్ఏ చెవిరెడ్డి భాస్కరరెడ్డి చాలాకాలంగా కోరుతున్నారు. ఇంతకాలం ఏమీ చెప్పని జగన్మోహన్ రెడ్డి మొత్తానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా ఎంఎల్ఏనే ప్రకటించారు. వైఎస్సార్ ఆసరా పథకంలో భాగంగా జరిగిన కార్యక్రమంలో ఎంఎల్ఏ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తన కొడుకు మోహిత్ రెడ్డి ఎంఎల్ఏగా పోటీచేయబోతున్నట్లు చెప్పారు.

విషయం ఏమిటంటే ఎంఎల్ఏకి జగన్ పార్టీలో కీలకమైన బాధ్యతలు అప్పగించారట. వచ్చే ఎన్నికల్లో అన్నీ నియోజకవర్గాల్లో అభ్యర్ధులను సమన్వయం చేసుకునే బాధ్యతలను చెవిరెడ్డికి జగన్ అప్పగించారట. అంటే చెవిరెడ్డికి అప్పగించిన బాధ్యతలను చూస్తుంటే చాలా కీలకమైనదనే అర్ధమవుతోంది. ఒకవైపు ఇంతటి కీలకమైన బాధ్యతలను మోస్తునే మరోవైపు చంద్రగిరిలో పోటీచేయటం తనకు ఇబ్బంది అవుతుందని ఎంఎల్ఏ చెప్పారట.

చెవిరెడ్డి వాదనతో ఏకీభవించిన జగన్ ఆయన స్ధానంలో కొడుకు మోహిత్ పోటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దాంతో చెవిరెడ్డి మద్దతుదారులంతా హ్యాపీగా ఉన్నారు. ఇప్పటికే మోహిత్ రెడ్డి నియోజకవర్గమంతా పాదయాత్రతో చుట్టేశారు. తండ్రికి బదులుగా కొడుకే నియోజకవర్గంలో మంచి చెడ్డా చూసుకుంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు పార్టీ వ్యవహారాలను కూడా మొహిత్ దగ్గరుండి చూసుకుంటున్నారు. కాబట్టి నేతలు, క్యాడర్ కు ఎంఎల్ఏ అయినా ఎంఎల్ఏ కొడుకు అయినా పెద్ద తేడా ఏమీ కనబడటం లేదు.

ఇదే సమయంలో టీడీపీ తరపున పులివర్తి నాని పోటీ చేయబోతున్నారు. నానికే పార్టీ టికెట్ ఖాయం చేసిందని నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా ప్రకటించిన విషయం తెలిసిందే. పోయిన ఎన్నికల్లో చెవిరెడ్డికి 1,27,790 ఓట్లు వస్తే, నానీకి 86,035 ఓట్లొచ్చాయి. అంటే నానీపై చెవిరెడ్డి 41,755 ఓట్ల మెజారిటితో గెలిచారు. నిజానికి రాబోయే ఎన్నికల్లో చంద్రగిరి నుండి పోటీ చేయటం నానికి ఇష్టం లేదని పార్టీ నేతలే చెబుతున్నారు. అయితే బలవంతంగా నానికే లోకేష్ టికెట్ ప్రకటించారని టాక్. మొత్తానికి ప్రధాన పార్టీల తరపున అభ్యర్ధులైతే ఖాయమైపోయారు. ఇక నామినేషన్లు వేయటమే మిగిలింది.