కరోనా అందరినీ కష్టపెడుతోంది. ఆదాయం పడిపోయి.. ఉపాధి కోల్పోయి అల్లాడిపోతున్నారు జనం. ఇలాంటి సమయంలో ప్రత్యక్షంగా.. పరోక్షంగా.. ఏ రకంగా అయినా జనాల్ని దోపిడీ చేయడం అన్యాయం. జనాల్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు కూడా ప్రభుత్వాన్ని నడపడానికి, తమ ఆదాయం పెంచుకోవడానికి జనాల్నే బాదేస్తున్నాయి.
గత కొన్ని వారాల్లో పెట్రోలు రేట్లు ఎలా పెరుగుతూ పోయాయో తెలిసిందే. 75 రూపాయల్లోపు ఉన్న పెట్రోలు ధర 83 రూపాయలకు చేరువైంది. పెట్రోలుతో పోలిస్తే తక్కువ ఉండే డీజిల్ దానికి దీటుగా తయారవడం పెద్ద విషాదం. ఆటోలు, లారీలు, ఇతర వాహనాల మీద బతికే పేద, మధ్య తరగతి జీవుల కష్టం ఎవరికి అర్థమవుతుంది. ఇంధన ఖర్చు కలిసొస్తుందని డీజిల్ వెహికల్ కొన్నవారి పరిస్థితి ఏంటి?
అంతర్జాతీయ స్థాయిలో చమురు ధరలు తగ్గుతున్నా సరే.. కేంద్రం పెట్రోలు, డీజిలు ధరలు పెంచుతూ పోతోంది. మరోవైపు రాష్ట్రాలు ఎడాపెడా పన్నులు బాదేస్తున్నాయి. వీళ్లయినా పన్నులు తగ్గిస్తారనుకుంటే.. అదనంగా వడ్డిస్తున్నారు. ఇటీవలే జగన్ సర్కారు ఎలా వడ్డన చేసిందో తెలిసిందే. తెలంగాణ కూడా తక్కువేమీ కాదు. ఇలాంటి సమయంలో కేసీఆర్, జగన్ సహా ఇండియాలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకూ పాఠం నేర్పే పని చేశారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.
ఆయన డీజిల్ మీద ఢిల్లీలో 30 శాతంగా ఉన్న రాష్ట్ర వ్యాట్‌ను 16.75 శాతానికి తగ్గించేశారు. దీంతో ఢిల్లీలో డీజిల్ ధర 82 రూపాయల నుంచి 73.64 రూపాయలకు తగ్గింది. డీజిల్ ధర పెరిగితే డీజిల్ వాహనాల మీద ఆధారపడ్డ పేద, మధ్య తరగతి ప్రజలు అల్లాడిపోవడమే కాదు.. సరకు రవాణా భారమై నిత్యావసరాల ధరలు కూడా పెరిగిపోతాయి. అలా కూడా జనాల మీద భారం పడుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఢిల్లీ సీఎం కరుణ చూపారు. మిగతా సీఎంలు కూడా ఆయన్ని అనుసరించాల్సిన అవసరముంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates