అర్వింద్ పై ఫ్లెక్సీ వార్

నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్ని వైపుల నుంచి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఫైర్ బ్రాండ్ గా పేరు పొందిన  అర్వింద్ ఇప్పుడు మాత్రం డిఫెన్స్ లో పడిపోయారు. ఒక పక్క కుటుంబ సమస్యలు ఆయన్న వేధిస్తున్నాయి. అన్న సంజయ్ కాంగ్రెస్ పార్టీలోకి వెళిపోతూ తండ్రి ధర్మపురి శ్రీనివాస్ ను కూడా తీసుకెళ్లి కండువా కప్పించారు. అర్వింద్ ఆయన్ను నిర్బంధించి..ఏ పార్టీలో చేరలేదని లెటర్ రాయించారన్న  ఆరోపణలు వచ్చాయి. ఆ వివాదం ఒకటైతే ఏదో విధంగా అర్వింద్ ను ఓడించాలన్న పట్టుదలతో బీఆర్ఎస్ పనిచేయడం ఆయనకు ఎదురవుతున్న అసలు సమస్య..

గత ఎన్నికల్లో అర్వింద్ చేతిలో ఓడిపోయిన కల్వకుంట్ల కవిత.. ఈసారి ఎలాగైనా ఆయన్ను మట్టి కరిపించాలన్న ధ్యేయంతో  పనిచేస్తున్నారు. అర్వింద్ ఆమెను బాగా టార్గెట్ చేసిన తరుణంలో కొడకా నీ సంగతి చూస్తా.. అని కూడా కవిత పచ్చిపచ్చిగా తిట్టారు. ఆ మధ్య అర్వింద్ ఇంటి ముందు ధాన్యం పోయించి నిరనస చేయించారు.

ఇప్పుడు నిజామాబాద్ వ్యాప్తంగా అర్వింద్ కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. పసుపు బోర్డు… ఇది మా ఎంపీగారు తెచ్చిన పసుపు బోర్డు’ అని ఫ్లెక్సీలు పెట్టి వినూత్న రీతిలో నిరసన తెలియజేస్తున్నారు. ఖాళీగా ఉన్న పసుపు బోర్డుపై  ఇదే మా ఎంపీ తెచ్చిన పసుపు బోర్డు అని రాసి నిరసన ప్రకటిస్తున్నారు.

పార్లమెంట్ ఎన్నికల సమయంలో అయిదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని వాగ్దానం చేసి  అర్వింద్ బాండ్ పేపర్ రాసిచ్చారు. అప్పటికే  బీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై అసంతృప్తిగా ఉన్న రైతులు ఆయనకు ఓటేశారు. కవితను ఓడించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ కి వచ్చి మరీ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ , రామ్ మాధవ్ హామీ ఇచ్చారు.

ఎన్నికల తర్వాత పసుపు బోర్డు ఇచ్చేందుకు మోదీ ప్రభుత్వం నిరాకరించడంతో అర్వింద్ కు ఎటూ పాలుపోని పరిస్థితి ఏర్పడింది. 2019 పార్లమెంటు ఎన్నికల్లో పసుపు బోర్డు తీసుకొస్తానని చెప్పి ఓట్లు వేయించుకున్న అర్వింద్ తమను మోసం చేశారని రైతుల ఇప్పుడు తీవ్ర ఆగ్రహం చెందుతున్నారు. అర్వింద్ సంగతి తేల్చుతామన్న రేంజ్  లో రైతులు మాట్లాడుతున్నారు…