పవన్ మాటకు కేంద్రం ఎంత విలువిచ్చిందంటే..

ఎంతసేపూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీని, ఆ పార్టీ నేతల్ని, మోడీ సర్కారును పొగడ్డమేనా.. వాళ్లు ఈయనకు ఏమాత్రం విలువ ఇస్తున్నారు.. ఏం సాయం చేస్తున్నారు.. ఈయన మాటల్ని ఏం పట్టించుకుంటున్నారు అంటూ తరచుగా ప్రశ్నలు తలెత్తున్నాయి. పవన్.. కేంద్ర ప్రభుత్వానికి, భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ఎప్పుడు ట్వీట్ వేసినా.. కింద కామెంట్లలో ఇవే ప్రశ్నలు ఎదురవుతుంటాయి. ఐతే దేశ విద్యా విధానంలో పెను మార్పులకు దోహదం చేస్తుందని భావిస్తున్న నూతన విద్యా విధాన రూపకల్పనలో కేంద్ర ప్రభుత్వం పవన్ చేసిన కీలకమైన సూచనలకు చోటివ్వడం విశేషం. ఇదేదో యాదృచ్ఛికంగా జరిగిన విషయం కూడా కాదు. పవన్ సూచనల్ని పరిగణనలోకి తీసుకుని వాటిని విద్యా విధానంలో పొందుపరిచినట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోక్రియల్ నిశాంక్ స్వయంగా ట్విట్టర్లో వెల్లడించడం విశేషం.

2019లో పవన్ ఎన్నికల ప్రణాళికల్లో భాగంగా విద్య విషయంలో తమ విధానాన్ని వెల్లడించిన వీడియోను మంత్రి ట్విట్టర్లో షేర్ చేశారు. ఆ వీడియోలో పవన్ తాను ఇంటర్మీడియట్ చదివేటపుడు.. రకరకాల ఆలోచనలు వచ్చేవని.. కార్పెంటరీ నేర్చుకుందామా.. పెయింటింగ్ నేర్చుకుందామా.. సంగీతం నేర్చుకుందామా అని ఆలోచించేవాడినని.. ఇలా పాఠశాలలు, కళాశాలల్లో రెగ్యులర్ సబ్జెక్టులకు పరిమితం అయిపోకుండా వేరే నైపుణ్యాలు, కళలు నేర్పించేలా మన విద్యాలయాలు ఉండాలని పేర్కొన్నాడు. సరిగ్గా ఇదే సూచనల్ని కేంద్రం నూతన విద్యా విధానంలో చేర్చింది. నిన్న ఎన్ఈపీ-2020 విధి విధానాల్ని ప్రకటించిన అధికారి అచ్చంగా పవన్ పేర్కొన్న సూచనల్నే మీడియాకు వెల్లడించడం విశేషం. ఆ వీడియోను కూడా కేంద్ర మంత్రి జోడించారు. ఇలా కేంద్ర మంత్రి పవన్ కళ్యాణ్ ఘనతను వివరంగా తెలియజేస్తూ ట్వీట్ వేయడం, వీడియో పెట్టడం జనసేనాని ఇమేజ్‌ను పెంచుతుందనడంలో సందేహం లేదు.

CLICK HERE!! For the Latest Updates on all the OTT Content