జనసేనాని పవన్ కల్యాణ్ ఎక్కడున్నారు.. ఇప్పుడాయన ఏం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల కోసం జనసేనను ఆయన ఎలా సమాయత్తం చేస్తున్నారు. పొత్తులు ఉంటాయా.. ఒంటరిగా పోటీ చేస్తారా.. ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాలతో పాటు సామాన్య ప్రజల్లోనూ తలెత్తుతున్నాయి. ఇటీవల జరిగిన పార్టీ పదవ ఆవిర్భావ సభ తర్వాత జనసేనలో ఎలాంటి రాజకీయ కదలిక కనిపించలేదు.
వారాహి టూర్ ఎప్పుడు
ఆంధ్రప్రదేశ్ అంతటా యాత్ర చేసేందుకు పవన్ కల్యాణ్ ఒక వాహనాన్ని సిద్దం చేసుకుని దానికి వారాహి అని పేరు పెట్టారు. జనవరి ఆఖరి వారంలో కొండగట్టులో వారాహికి పూజలు జరిగాయి. పార్టీ పదవ ఆవిర్భావ సభలో వారాహిపై ఆయన కనిపించారు. స్టేట్ టూర్ ఇంతవరకు ఖరారు కాలేదు. ఎప్పుడు చేస్తారో తెలీదు. మరో పక్క టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 50 రోజులు దాటింది. ఆయన్ను చూసేందుకు, ఆయనతో మాట్లాడేందుకు విపరీతంగా జనం వస్తున్నారు. అయినా జనసేన మాత్రం పరిస్థితిని అర్థం చేసుకోవడం లేదు. రాజకీయంగా దూకుడును ప్రదర్శించాలన్న కోరిక వారిలో కనిపించడం లేదు..
ఏప్రిల్ మొత్తం షూటింగులు..
పవన్ కల్యాణ్ ఫిలిం కమిట్మెంట్స్ పూర్తి చేసే పనిలో ఉన్నారని సినీ జనం అంటున్నారు. ఒప్పుకున్న సినిమాలన్నీ పూర్తి చేస్తే రాజకీయాలకు ఫుల్ టైమ్ వినియోగించే వీలుంటుందని ఆయన అనుకుంటున్నారట. అందుకే ఏప్రిల్ మొత్తం ఔట్ డోర్ షూటింగ్ షెడ్యూల్ పెట్టుకున్నారు. అంటే మేలోనో, ఆ తర్వాతో ఏపీలో యాత్రలు ఉంటాయి. ఈ లోపే జగన్ ముందస్తుకు వెళితే టూర్ ఎలా చేస్తారో చూడాలి.
తేలని పొత్తులు..
ఎన్నికల పొత్తులపై కూడా మిత్ర పక్షాల మధ్య క్లారిటీ రాలేదు. 20 సీట్లలో మాత్రమే పోటీ చేయబోతున్నట్లు వాట్సాప్ ప్రచారాలను నమ్మొద్దని పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ ప్రకటించారు. అయితే పవన్ ను తొక్కేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, అది బాబు నైజమని వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తున్నప్పటికీ జనసేనలో చలం రావడం లేదు. పొత్తు చర్చలు ఆలస్యం చేస్తే ఇచ్చినన్ని సీట్లతో జనసేన సరిపెట్టుకుంటుందని చాప కింద నీరులా ప్రచారం జరుగుతోంది. కాకపోతే సీట్ల సర్దుబాటుపై టీడీపీ తొందరపడ దలచుకోలేదు. అందుకు వేరే కారణాలున్నాయని అంటున్నారు. పైగా పొత్తులపై పోలిట్ బ్యూరో చర్చించలేదని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు. దానితో పవన్ ముందుకెళ్లక, టీడీపీ చొరవ చూపకపోతే పొత్తులపై క్లారిటీ ఎప్పుడు వస్తుందో అర్థం కాక క్షేత్ర స్థాయిలో ఉన్న జనసేన నేతలు టెన్షన్ పడుతున్నారు….
Gulte Telugu Telugu Political and Movie News Updates