మా సంసారంలో నిప్పులు పోయొద్దు చిరు

కరోనాను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ పలు వీడియోలు, పాటలు రూపొందించిన సినీ తారలు…లాక్ డౌన్ పుణ్యమా అంటూ కుటుంబ సభ్యులతో చాలా సమయం గడుపుతున్నారు.
ఎప్పుడూ షూటింగ్ లతో బిజీబిజీగా ఉండే సినీ హీరోలు, దర్శక నిర్మాతలు లాక్ డౌన్ వల్ల దొరికిన గ్యాప్ ను ఇంటి కోసం కేటాయిస్తున్నారు.

కేవలం తిని కూర్చోవడమే కాదు…ఇంటి పనుల్లో తాము కూడా ఓ చేయి వేసి ఇంట్లోని ఆడవారికి పనిభారం తగ్గించే పనిలో పడ్డారు మన టాలీవుడ్ సెలబ్రిటీస్. రీల్ లైఫ్ లోనే కాదు..రియల్ లైఫ్ లోనూ హీరోలమేనని ప్రూవ్ చేస్తున్నారు. ఈ ప్రాసెస్ లోనే బీ ద రియల్ మ్యాన్ చాలెంజ్( #BeTheRealMan challenge) ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది.

తాజాగా ఈ చాలెంజ్ ను యాసెప్ట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి…తాను ఇంటిపని చేస్తున్న వీడియోను ట్వీట్ చేశారు. ఆ వీడియో చూసిన ప్రముఖ నిర్మాత, వైసీపీ నేత పీవీపీ…సెటైరికల్ గా ట్వీట్ చేశారు. ఇంట్లో అంట్లు తోమడం వంటివి చేయగలమని…కానీ, మీలా వండడం రాక భార్యల చేతుల్లో బలవుతున్నామని చమత్కరిస్తూ ట్వీట్ చేశారు.

ఇంట్లో అంట్లు తోమగలము,గచ్చు కడగడం ఈజీ అని…తనకు వంట రాదని ట్వీట్ చేశారు పీవీపీ. అయితే, మెగాస్టారే వంట చేయగా లేనిది…మీరు చేయడానికేమిటని తన భార్య అడుగుతోందని పీవీపీ వాపోయారు. స్టార్ చెఫ్ లా నలభీమ పాకం వండుతున్న మెగాస్టార్ తో..తమను పోలుస్తున్నారని…తమ సంసారంలో నిప్పులు పోయొద్దు రియల్ లైఫ్ మెగాస్టార్ గారు అంటూ పీవీపీ సరదాగా ట్వీట్ చేశారు.

అంతకుముందు, తాను ఇంట్లో పనులు చేస్తున్న వీడియోను జూనియర్ ఎన్టీఆర్ పోస్ట్ చేశారు. ఇంట్లో పనులను పంచుకోవడంలో చాలా ఆనందం ఉందంటూ జూనియర్ ఎన్టీఆర్ ఓ వీడియో పోస్ట్ చేసి…చిరంజీవిని చాలెంజ్ చేశారు.దానికి స్పందించిన చిరు…తాను రోజు ఇంట్లో పనులు చేస్తున్నానని…కాకపోతే అడిగారని ఈ రోజు వీడియోను సాక్ష్యంగా పెడుతున్నానని చిరు ట్వీట్ చేశారు.

అంతేకాదు, తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ ను, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ను చిరు చాలెంజ్ చేశారు. మరి, ఆ చాలెంజ్ కు వారిద్దరు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.