స్పీకర్ తమ్మినేని ఫోర్జరీ చేశారా.. !

Tammineni-Sitaram

కూన రవికుమార్ ..టీడీపీ హార్డ్ కోర్ నేత. జగన్ పేరు చెప్పినా, తన ప్రత్యర్థి అయిన స్పీకర్ తమ్మనేని సీతారాం పేరు చెప్పినా ఆయన ఒంటి కాలి మీద లేస్తుంటారు. వైసీపీ ప్రభుత్వం ఆయన మీద కేసులు కూడా పెట్టింది. అయినా కూన  ఒక్క అడుగు  కూడా వెనుకంజ వేయలేదు. టీడీపీ అధినేత చంద్రబాబుకు వీరవిధేయుడు, వీర భక్తుడైన  రవికుమార్… వైసీపీ ప్రభుత్వంపై రోజు వారీ ఆరోపణలు చేస్తుంటారు. తాజాగా చేసిన ఒక ఆరోపణ మాత్రం తీవ్ర సంచలనమైంది..

తమ్మినేని ఫోర్జరీ చేశారని రవికుమార్ ఆరోపిస్తున్నారు. ఫోర్జరీ డిగ్రీ సర్టిఫికెట్ తో తమ్మినేని మూడు సంవత్సరాల  లా కోర్సులో చేరారని రవికుమార్ ప్రధాన ఆరోపణ. ఈ సంగతి ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆరోపించారు. అందుకు ఒక లాజిక్ కూడా ఆయన జనం ముందుంచారు. ఎన్నికల అఫిడవిట్లో తమ్మినేని డిగ్రీ  డిస్కంటిన్యూడ్ అని పెట్టారట. అయితే 2019 ఆగస్టులో హైదారాబాద్ ఎల్బీ నగర్ లోని మహాత్మాగాంధీ న్యాయ కళాశాలలో మూడు సంవత్సరాల డిగ్రీ కోర్సు చేరారట. ఇందుకుగాను ముమ్మాటికీ ఫోర్జరీ డిగ్రీ సర్టిఫికెట్‌ను స్పీకర్‌ తమ్మినేని సమర్పించారని రవికుమార్ అంటున్నారు.

రవికుమార్  ఒకప్పుడు విప్ గా చేశారు. ఇప్పుడాయన స్పీకర్  పై రాష్ట్రపతి, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, తెలుగు రాష్ట్రాల గవర్నర్లకు ఫిర్యాదు లేఖా రాశారు. డిగ్రీ పాస్ కాకుండా  మూడు సంవత్సరాల లా కోర్సు ఎలా చేరతారో చెప్పాలని రవికుమార్  ప్రశ్నిస్తున్నారు. జగన్ కు దమ్ముంటే తమ్మినేనిపై సీఐడీ విచారణ జరిపించాలని రవికుమార్   డిమాండ్ చేస్తున్నారు.  తమ్మినేనిని పదవి నుంచి  తప్పించాలని ఆయన కోరుతున్నారు. మరి జగన్ ఆయన మాట పట్టించుకుంటారో లేదో చూడాలి.