తెలంగాణాలో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పరిస్ధితి బాగా అయోమయం అయిపోతోంది. కొద్దిరోజులుగా షర్మిల ఉనికి ఎక్కడా పెద్దగా కనబడటలేదు, వినబడటంలేదు. టీఎస్ పీఎస్సీ ప్రశ్రపత్రాల లీకేజీ వ్యవహారంలో రాష్ట్రమంతా అట్టుడికిపోతుంటే షర్మిల మాత్రం తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అంతకుముందు పాదయాత్రంటు నానా హంగామా చేసిన విషయం తెలిసిందే. నాలుగురోజులు నానా హడావుడి చేయటం తర్వాత కొద్దిరోజులు చప్పుడు చేయకుండా కూర్చోవటం అలవాటైపోయినట్లుంది.
ఉద్యోగాలు భర్తీ చేయటంలేదని, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని షర్మిల ఆమధ్య ఎంత హడువుడి చేశారో అందరు చూసిందే. నిరుద్యోగులకు మద్దతుగా ఆమధ్య ప్రతి మంగళవారం దీక్ష చేసేవారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటినీ ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని పదేపదే డిమాండ్ చేశారు. కేసీయార్, కేటీయార్, కవితలను షర్మిల అనేక సందర్భాల్లో డైరెక్టుగా టార్గెట్ చేసి వార్తల్లోవ్యక్తిగా నిలిచారు.
అలాంటిది టీఎస్ పీఎస్సీ బోర్డు నిర్వహించిన అనేక పరీక్షల ప్రశ్నపత్రాలు లీకైన విషయం బయటపడింది. దాంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నానా గోలచేస్తున్నాయి. దాదాపు పదిరోజులుగా బోర్డు ఆపీసు ముందు రచ్చరచ్చ చేస్తున్నాయి. ఇదే సమయంలో నిరుద్యోగులు, పరీక్షలు రాసిన వాళ్ళు కూడా పెద్దఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఉద్యోగాలు, పరీక్షల నిర్వహణ, ప్రశ్నపత్రాల లీకేజీలు, పరీక్షల రద్దు నేపధ్యంలో రాష్ట్రంలో ఇంత గందరగోళం జరుగుతుంటే షర్మిల మాత్రం ఎక్కడా కనబడటంలేదు.
ప్రస్తుత పరిస్ధితులను అడ్వాంటేజ్ గా తీసుకుని జనాల్లో చొచ్చుకుని వెళ్ళేందుకు పార్టీకి అన్నివిధాలుగా అవకాశాలు కనిపిస్తున్నా షర్మిల ఎందుకని పట్టించుకోవటంలేదు? అన్నదే ఆశ్చర్యంగా ఉంది. నిరుద్యోగులను, పరీక్షలు రాసిన అభ్యర్ధులన కలిపి బోర్డు ముందు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాలు చేయటానికి షర్మిలకు ఇదే మంచి అవకాశం. కానీ షర్మిల మాత్రం ఆ దిశగా ఆలోచిస్తున్నట్లు లేదు. టీఎస్ పీఎస్సీ పరీక్షలు రాసిన అభ్యర్ధులు, నిరుద్యోగులను పిలిచి సమావేశం అంటే ఎంతమంది వస్తారో ఊహించలేరు. అలాంటి ఉద్యమాలు చేయటానికి అందివచ్చిన అవకాశాలను షర్మిల వదులుకుంటున్నారంటేనే ఆశ్చర్యంగా ఉంది. అందుకనే అందరు షర్మిలకు ఏమైంది అని అనుకుంటున్నారు.