అటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం.. ఇటు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం.. వెరసి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాంచి జోష్‌లో ఉన్నారు. తాజాగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై టీడీపీ అన్‌స్టాపబుల్ అని, గేరు మారుస్తామని, స్పీడు పెంచుతామని అన్నారు. అడ్డు వస్తే తొక్కుకుంటూ వెళ్తామని చంద్రబాబు హెచ్చరించారు. ఎమ్మెల్సీగా పంచుమర్తి అనురాధ గెలుపు జగన్ సర్కార్‌కు చెంపపెట్టని వ్యాఖ్యానించారు.
తప్పులు చేయడం.. రాష్ట్రాన్ని దోచుకోవడమే జగన్ పని మండిపడ్డారు. ఏపీలో వైసీపీ చేసిన విధ్వంసంతో 30 ఏళ్లు వెనక్కి వెళ్లామని, ప్రజావేదికను కూలగొట్టిన రోజే జగన్ వైఖరేంటో అర్ధమైందని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు జగన్ అని, జగన్ చేసిన అవమానాలను ప్రజలు భరిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం జగన్ గాల్లో పల్టీలు కొట్టారని ఎద్దేవా చేశారు. జగన్ ఎంతో కసరత్తు చేశారు. చివరికి బొక్క బోర్లా పడ్డారన్నారు.
బయటకు రాని వారు చాలా మంది!
వైసీపీలో ప్రస్తుతానికి నలుగురు ఎమ్మెల్యేలే తమ అసంతృప్తిని బయటపెట్టారని, బయటకు రాని ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారని చంద్రబాబు అన్నారు. వైసీపీ సేవాదళ్ అధ్యక్షుడే ఆ పార్టీలో ఉండలేకపోయారని, నమ్మకంగా ఉండే నేతలే జగన్‌ను వీడి వెళ్తున్నారని తెలిపారు. పులివెందులలో కూడా టీడీపీ జెండా ఎగిరిందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జగన్‌కు షాకిచ్చాయని, తాడేపల్లిలో టీవీలు పగిలిపోతున్నాయని తెలిపారు.
జగన్‌రెడ్డి రాజధాని అమరావతిని భ్రష్టు పట్టించారని చంద్రబాబు దుయ్యబట్టారు. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా తిరుగుబాటు చేశారని గుర్తుచేశారు. కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి చేరికతో పార్టీ మరింత బలపడుతుందన్నారు. అబద్దాలతో ప్రజలను మభ్యపెట్టాలని జగన్ చూశారని, దేవుడు స్క్రిప్ట్ తిరగరాశాడని చంద్రబాబు వ్యాఖ్యానించడం విశేషం.
Gulte Telugu Telugu Political and Movie News Updates