పట్టభద్రుల ఎంఎల్సీ ఎన్నికల్లో ఓటమిపై బీజేపీ నేతలు చేసిన ఆరోపణలపై ఇప్పటివరకు జనసేన నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. మూడు పట్టభద్రుల ఎంఎల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఓటమి విషయం ఎలాగున్నా ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానంలో బీజేపీ అభ్యర్థి మాధవ్ ఘోరంగా ఓడిపోయారు. సిట్టింగ్ స్ధానాన్ని కోల్పోవటంతో బీజేపీ నేతలు బాగా మంట మీద ఉన్నారు. ఇదే విషయమై మూడు రోజుల కిందట మాధవ్ మాట్లాడుతూ జనసేనపై ఆరోపణలు చేశారు.
మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కల్యాణ్ సహకరించని కారణంగానే బీజేపీ ఓడిపోయిందన్నారు. ఎన్నికల్లో సహకరించాలని తాము అడిగినా పవన్ పట్టించుకోలేదని మండిపోయారు. పైగా వైసీపీకి ఓట్లేయద్దని చెప్పిన పవన్ బీజేపీకి ఓట్లు వేయమని చెప్పలేదన్న విషయాన్ని గుర్తుచేశారు. మాధవ్ ఆరోపించారని కాదుకానీ పవన్ నిజంగా చెప్పింది కూడా ఇదే. మిత్రపక్షానికి ఓట్లేయాలని పవన్ ఎక్కడా చెప్పలేదు. తాజాగా అదే విషయాన్ని బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కన్ఫర్మ్ చేశారు.
ఎన్నికల్లో జనసేన నుండి తమకు ఎలాంటి సహకారం అందలేదని వీర్రాజు కుండబద్దలు కొట్టకుండానే చెప్పారు. ఇక్కడ వీర్రాజు చెప్పారని కాదుకానీ ఇప్పటివరకు జరిగిన ఏ ఎన్నికలో కూడా బీజేపీకి జనసేన సహకరించలేదు. తిరుపతి పార్లమెంటు ఉపఎన్నిక, నెల్లూరు జిల్లా ఆత్మకూరు, కడప జిల్లా బద్వేలు ఉపఎన్నికల్లో కూడా పెద్దగా సహకరించింది లేదు. అలాగే స్ధానికసంస్ధల ఎన్నికల్లో కూడా జనసేన-టీడీపీ అవగాహనతో పోటీచేసిన విషయం అందరికీ తెలిసిందే.
అప్పట్లో సహకరించలేదని పవన్ విషయమై మాట్లాడని బీజేపీ ఇపుడు మాత్రమే ఎందుకింత గోలచేస్తోంది ? సరే బాగా మంటమీదుంది కాబట్టి బీజేపీ నేతలు గోలచేస్తున్నారు. మరి జనసేన వైపునుండి సమాదానం ఎందుకు వినిపించటంలేదు. తమపై బీజేపీ చేస్తున్న ఆరోపణలకు పవన్ కానీ లేదా నాదెండ్ల మనోహర్ సమాధానం చెప్పాలి కదా. సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నారంటే బీజేపీ ఆరోపణలను అంగీకరిస్తున్నట్లే అనుకోవాలి. మిత్రపక్షాలుగా ఇలా గొడవలుపడుతు ఇష్టంలేని కాపురం చేసేబదులు హ్యాపీగా విడిపోవచ్చు కదా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి.