23 టెన్షన్ పెరిగిపోతోందా ?

గురువారం అంటే 23వ తేదీన జరగాల్సిన ఎంఎల్ఏ కోటా ఎంఎల్సీ ఎన్నికలు రెండు పార్టీల్లో టెన్షన్ పెంచేస్తోందా ? పార్టీల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. ఎంఎల్ఏ కోటాలో భర్తీ కావాల్సిన ఏడు ఎంఎల్సీ స్దానాలకు గురువారం పోలింగ్ జరగబోతోంది. మామూలుగా అయితే సంఖ్యా బలాన్ని చూసుకుంటే ఏడుస్ధానాలను వైసీపీ ఏకగ్రీవంగా ఖాతాలో వేసుకోవాలి. కానీ చివరి నిముషంలో టీడీపీ పోటీలోకి దిగటంతో ఎన్నిక అనివార్యమైంది.

గెలుపుకు అవసరమైన సంఖ్యాబలం లేకపోయినా టీడీపీ పోటీకి దిగటమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పోటీకి దిగటానికి కారణం ఏమిటంటే వైసీపీలోని అసంతృప్త ఎంఎల్ఏలే కారణమని తెలుస్తోంది. ప్రతి ఎంఎల్సీకి 22 మంది ఎంఎల్ఏలు ఓట్లేయాలి. ఈ లెక్కన చూస్తే టీడీపీకి ఉన్నది 19 మంది ఎంఎల్ఏలే. 23 మంది ఎంఎల్ఏలు గెలిచినా తర్వాత నలుగురు ఎంఎల్ఏలు దూరమైపోయారు. కాబట్టి దూరమైన ఎంఎల్ఏల ఓట్లు రావని అందరికీ తెలిసిందే.

అందుకనే వైసీపీ ఎంఎల్ఏలపైన టీడీపీ గురిపెట్టింది. ఇప్పటికే అధికారపార్టీలో ఇద్దరు ఎంఎల్ఏలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధరరెడ్డి రెబల్సుగా తయారయ్యారు. వీళ్ళు వైసీపీ అభ్యర్ధులకే ఓట్లేస్తారా లేకపోతే టీడీపీకి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేస్తారా అన్నది సస్పెన్సుగా మారింది. వీళ్ళిద్దరు ఓట్లేసినా టీడీపీ గెలవదు. అందుకనే జగన్మోహన్ రెడ్డిపై అసంతృప్తిగా ఉన్న ఎంఎల్ఏలు ఎవరైనా ఉన్నారా అని వెదుకుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇందులో భాగంగా వైసీపీ ఓట్లకోసం టీడీపీ గాలమేస్తుంటే తమ ఓట్లను కాపాడుకునేందుకు వైసీపీ అవస్తలు పడుతోంది. గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో పోలింగ్ మొదలై సాయంత్రం 4 గంటలకు ముగిసేంతవరకు రెండు పార్టీల్లో ఈ టెన్షన్ తగ్గేట్లులేదు. ఎంఎల్ఏలతో క్యాంపులు నిర్వహించటం లేదుకానీ దాదాపు అంత పనీ చేస్తున్నాయట రెండుపార్టీలు. సమయం దగ్గర పడుతున్నకొద్దీ టెన్షన్ పెరిగిపోతోంది. ఎందుకంటే టీడీపీ ఓడిపోతే ఆ పార్టీకి వచ్చే నష్టమేమీలేదు. ఇదే సమయంలో వైసీపీ నుండి రెబల్ ఎంఎల్ఏల ఓట్లు కాకుండా మరో ఓటు అదనంగా క్రాస్ అయినా జగన్ కు ఇబ్బందులు తప్పవు. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.