కరోనా బాధితుడిని వెతకడానికి పోలీసు బృందం

కరోనా వేళ.. అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడెవరు ఎలా వ్యవహరిస్తారో ఏ మాత్రం అర్థం కాని పరిస్థితి. తాజాగా అలాంటి ఉదంతమే గుంటూరులోచోటు చేసుకుంది. గుంటూరు పక్కనే ఉన్న కృష్ణా జిల్లాకు చెందిన ఒకవ్యక్తిని కరోనా అనుమానాలు ఉండటంతో గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు.

అతనికి పరీక్షలు జరిపిన వైద్యులు.. ఫలితాలు ఇంకా రావాల్సి ఉన్న నేపథ్యంలో.. ఐసోలేషన్ వార్డులో ఉంచి పరీక్షిస్తున్నారు. ఇదిలా ఉండగా.. గురువారం అర్థరాత్రి వేళ.. ఆసుపత్రి నుంచి పారిపోయిన వైనం కలకలకం రేపుతోంది. ఆ వ్యక్తి.. అక్కడి సిబ్బంది కళ్లుగప్పి పారిపోయినట్లుగా గుర్తించారు.

దీంతో.. గుంటూరు వాసుల గుండెల్లో దడ పుట్టేస్తున్న పరిస్థితి. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వ్యక్తి ఆసుపత్రి నుంచి పారిపోతే.. తమకు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇతన్ని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆసుపత్రి నుంచి పారిపోయిన వ్యక్తి మీద పోలీసులు కేసు నమోదు చేశారు.