నొప్పి తెలీకుండా చంపేయండి: సుప్రీం కోర్టు

తీవ్రమైన నేరాల్లో మ‌ర‌ణ శిక్ష ఎదుర్కొంటున్న వారి విష‌యం పై సుప్రీం కోర్టు సంచ‌లన వ్యాఖ్య‌లు చేసింది. సాధార‌ణంగా ప్ర‌పంచ దేశాలు అన్నీ కూడా.. మ‌ర‌ణ శిక్ష‌ల‌కు దూరంగా ఉంటున్నాయి. ఇలాంటి వాటిని తీవ్రంగా కూడా తీసుకుంటున్నాయి. అయితే.. భార‌త్‌ లో ఇప్ప‌టికీ.. ఉరి శిక్ష విధించ‌డం.. అమ‌లు చేయ‌డం అమ‌ల్లోనే ఉంది. దీని పై ప్ర‌జాస్వామ్య వాదులు రాద్ధాంతం చేస్తున్నా .. ఉద్య‌మాలు నిర్వ‌హిస్తున్నా.. ఈ చ‌ట్టం మాత్రం అమ‌ల్లో ఉంది. అయితే.. ఉరి శిక్ష కార‌ణంగా దోషి తీవ్రంగా నొప్పితో బాధ‌ప‌డుతూ.. మ‌ర‌ణించాల్సి వ‌స్తుంద‌ని.. ప్ర‌త్యామ్నాయ మార్గాలు అన్వేషించాల‌ని కోరుతూ.. సుప్రీంలో పిటిష‌న్ ప‌డింది.

దీనిని విచార‌ణ‌కు స్వీక‌రించిన సుప్రీంకోర్టు.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. దోషులకు మరణ శిక్ష అమలు చేసేందుకు ఉరి కాకుండా.. తక్కువ బాధ కలిగించే ప్రత్యామ్నాయాల వైపు కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఉరి చాలా బాధాకరమైన ముగింపు అన్న ధర్మాసనం… దీని కంటే తక్కువ బాధ కలిగించే మరణ శిక్ష అమలుపై చర్చలు ప్రారంభించాలని పేర్కొంది. ఇందుకు సంబంధించిన అవసరమైన సమాచారాన్ని సేకరించాలని కేంద్రాన్ని ఆదేశించింది.

అవ‌స‌ర‌మైతే.. ఉరి శిక్ష అమలు ప్రత్యామ్నాయాల పై నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్న సర్వోన్నత న్యాయస్థానం.. తుపాకీతో కాల్చడం, విష‌పూరిత ఇంజెక్షన్ ఇవ్వడం, విద్యుత్ కుర్చీలో కూర్చోబెట్టి చంప‌డం వంటి వాటిని పరిశీలించాలని కేంద్రానికి సూచించింది. ఉరి శిక్ష క్రూరమైనదని అంగీకరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. దీనిపై తమకు కొంత శాస్త్రీయ సమాచారం కావాలని వ్యాఖ్యానించింది.

ఉరి వల్ల కలిగే నొప్పిపై అధ్యయన సమాచారాన్ని ఇవ్వాలని అటార్నీ జనరల్‌ను కోరిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్.. దాని ఆధారంగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అమెరికాలో మరణ శిక్షకు ప్రాణాంతక ఇంజెక్షన్‌ విధానాన్ని అవలంబిస్తున్నారని.. అందులో ఏ రసాయనాన్ని ఉపయోగిస్తారనే దానిపై కూడా పరిశోధన చేయాలని కోర్టు సూచించ‌డం గ‌మ‌నార్హం.

కొస‌మెరుపు: ఈ విచార‌ణ జ‌రుగుతున్న స‌మ‌యంలో కొన్ని స్వ‌చ్ఛంద సంస్థ‌లు అస‌లు మ‌ర‌ణ శిక్ష వ‌ద్దంటూ.. సుప్రీంకు అర‌కిలో మీట‌రు దూరంలో తీవ్ర నిర‌స‌న వ్యక్తం చేయ‌డం గ‌మ‌నార్హం.