ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత రాజకీయ వాతావరణమే మారిపోయింది. తెలుగుదేశం పార్టీ దూకుడు పెంచింది. జగన్ సర్కారుపై ఆరోపణాస్త్రాలు సంధిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు కొత్త వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. ఈ నెల 25 నుంచి జనంలోకి వెళ్లేందుకు కొత్త కార్యక్రమం సిద్ధం చేస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయాన్ని ప్రస్తావిస్తూ.. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపిస్తే ఏం చేయబోతున్నామో వివరిస్తారు…
జగన్మోహన్ రెడ్డి ఒక నేరగాడని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. అందరినీ తనలాగే నేరగాళ్లుగా మార్చేస్తున్నాడని వివరిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక్లలో నేర ప్రవృత్తిని ప్రదర్శించి గెలవాలనుకున్నాడని చంద్రబాబు అంటున్నారు. చివరకు రిటర్నింగ్ అధికారులను కూడా పార్టనర్స్ ఇన్ క్రైమ్ గా మార్చెయ్యాలని అనుకున్నట్లుగా ఆయన ఆరోపించారు.జిల్లా కలెక్టర్లనే పార్టనర్స్ ఇన్ క్రైమ్ గా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారని, వాళ్లు అప్రమత్తంగా ఉండకపోతే జగన్ ట్రాప్ లో పడిపోయే ప్రమాదం ఉందని చంద్రబాబు అంటున్నారు.
జగన్ నేర సామ్రాజ్యం
జగన్ నేర సామ్రాజ్యాన్ని విస్తరించకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని చంద్రబాబు చెబుతున్నారు. అసెంబ్లీలో దాడులను కూడా లైట్ గా తీసుకోకూడదని చంద్రబాబు హెచ్చరిస్తున్నారు. అలాగే వదిలేస్తే ఒక సైకో వందల మంది సైకోలను తయారు చేస్తాడన్నారు. ఎమ్మెల్యేలపై దాడిని శాసనసభ చరిత్రలో చీకిటి రోజుగా పరిగణించాలన్నారు. జనం గొంతు నొక్కేందుకు జీఓ నెంబర్ వన్ తెచ్చిన జగన్, ఇప్పుడు అసెంబ్లీ వేదికగా ప్రజానేతల గొంతునులిమే ప్రయత్నం చేస్తున్నారన్నారు. టీడీపీ హయాంలో వైసీపీ ఎమ్మెల్సేలు కూడా మాట్లాడారని అప్పుడు తాము జగన్ తరహాలో ప్రవర్తించలేదని చంద్రబాబు గుర్తుచేశారు. అధికారంలో ఉన్న వాళ్లు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని 151 మంది ఉన్నారని రెచ్చిపోతే తర్వాత ఇబ్బందులు తప్పవన్నారు. పోలీసులు కూడా వాళ్లను కాపాడలేరన్నారు. కేసులు పెడితేనో, భయపెడితేనో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. ఇలాంటి సంక్షోభాలు ఎన్నో చూశామని చంద్రబాబు చెప్పుకున్నారు.
పార్టనర్స్ ఇన్ కరప్షన్
జగన్ కొందరిని పార్టనర్స్ ఇన్ కరప్షన్ గా కూడా మార్చుకున్నారట. ఇసుక దండా, మట్టి దందా చేయిస్తున్నారట. ఇసుక దందాకు ముందే అడ్వాన్స్ కట్టిన ఒక కాంట్రాక్టర్ తర్వాత వ్యాపారం నడవక ఆత్మహత్య చేసుకున్నాడని చంద్రబాబు గుర్తు చేస్తున్నారు. నిజాయితీగా వ్యాపారం చేయాలనుకున్న వారిని కూడా జగన్ రెడ్డి అవినీతిపరులుగా మార్చేస్తున్నారని చంద్రబాబు అంటున్నారు. తాము అధికారానికి రాగానే అన్ని సెట్ చేస్తామన్నారు.