ఈసారీ డుమ్మా కొడితే.. ఈడీ అరెస్టే!

ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణంలో తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ క‌విత ఇప్ప‌టికి రెండు సార్లు ఈడీ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. ఒక‌సారి హైద‌రాబాద్‌లో నేరుగా ఆమె ఇంట్లోనే విచార‌ణ జ‌రిపిన అధికారులు రెండో సారి ఢిల్లీలో విచారించారు. అయితే.. మూడోసారి కూడా విచారించాల్సి ఉంద‌ని పేర్కొంటూ.. నోటీసులు ఇచ్చారు. కానీ, క‌విత మూడో సారి విచార‌ణ‌కు డుమ్మా కొట్టారు. త‌న‌కు ఒంట్లో బాగోలేద‌ని, రాలేన‌ని త‌న లాయ‌ర్ ద్వారా కావాల్సిన స‌మాచారం పంపిస్తున్నాన‌ని పేర్కొంటూ.. ఆమె త‌ర‌ఫున లాయ‌ర్ భ‌ర‌త్‌ను పంపించారు.

ఈడీ మాత్రం భర‌త్ వ‌చ్చినా.. ప్ర‌యోజ‌నం లేద‌ని పేర్కొంటూ.. ఇంకోసారి విచార‌ణ‌కురావాల్సిందేన‌ని తేల్చి చెప్పింది. సోమ‌వారం ఆమెను(ఈనెల 20న‌) విచార‌ణ‌కు రావాల‌ని తేల్చి చెప్పింది. అయితే.. త‌న విచార‌ణ‌పై క‌విత ఇప్ప‌టికే సుప్రీం కోర్టులో కేసు వేశారు. మ‌హిళ‌న‌ని కూడా చూడ‌కుండా వేధిస్తున్నార‌ని.. సాయంత్రం 5 త‌ర్వాత విచారించ‌కూడద‌ని తెలిసినా.. 8 గంట‌ల‌వర‌కు విచారించార‌ని, థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగిస్తున్నార‌ని.. ఈడీపై ఆరోపించారు. ఈ కేసు విచార‌ణ ఈ నెల 24న సుప్రీంకోర్టు విచారించ‌నుంది. అయితే.. ఇంత‌లోనే ఈ నెల 20న విచార‌ణ‌కు రావాల‌ని ఈడీ మ‌రోసారి నోటీసులు పంపించింది.

ఈ ప‌రిణామాల క్ర‌మంలో క‌విత ఇప్పుడు చేయ‌నున్నారు? అనేది ఆస‌క్తిగా మారింది. ఈసారి కూడా ఈడీ విచార‌ణ‌కు హాజ‌రు కాక‌పోతే.. అరెస్టు చేసే అవ‌కాశం మెండుగా ఉంటుంద‌ని గ‌త అనుభ‌వాల నేప‌థ్యంలో క‌విత శిబిరం భావిస్తోంది. ఈ నేప‌థ్యంలో క‌విత ఢిల్లీకి వెళ్లారు. ఆమెతో పాటు మంత్రి కేటీఆర్‌, ఎంపీ సంతోష్‌ కూడా ఉన్నారు. అయితే, ఢిల్లీకి వెళ్లినంత మాత్రాన క‌విత‌ విచారణకు హాజరవుతారా? లేక గతంలో మాదిరిగా తన న్యాయవాదిని పంపిస్తారా? అనేది ఉత్కంఠగా మారింది. ఒక‌వేళ ఈసారి త‌ప్పించుకున్నా.. మ‌రో రెండు రోజుల్లోనే విచార‌ణ‌కు ర‌మ్మ‌ని ఆదేశించే అవ‌కాశం ఈడీకి ఉంది. లేక‌పోతే.. సుప్రీంకోర్టు నుంచి ప్ర‌త్యేక అనుమ‌తి తీసుకుని అరెస్టు చేసినా చేయొచ్చ‌ని న్యాయ‌నిపుణులు అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.