టీడీపీతోనే జనసేనాని

జనసేన పదవ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. మచిలీపట్నం వేదికగా నిర్వహించిన సభకు లక్షలాది మంది తరలి వచ్చారు. తొలుత వారాహి వాహనంపై బయలుదేరి వెళ్లిన పవన్ అడుగడుగునా జనం ఆయన్ను ఆపి సంఘీభావం ప్రకటించడంతో వేగంగా ముందుకు కదల్లేకపోయారు. దానితో వారాహి దిగి కాన్వాయ్‌గా ఆయన సభా స్థలికి చేరుకున్నారు. రాత్రి పది తర్వాతే ఆయన స్పీచ్ మొదలైంది. దాదాపు గంటన్నర ప్రసంగంలో పవన్ అనేక అంశాలను ప్రస్తావించారు. శ్రీ శ్రీ , జాషువా, సీతారామశాస్త్రి, గోరెటి వెంకన్న కవితలను ఆయన చదివి వినిపిస్తూ సమకాలీన సమాజానికి వాటి ఆవశ్యకతను వివరించారు.

బలిపశువు కాదు..

ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఖాయమన్నట్లుగా పవన్ సంకేతాలిచ్చారు. ఈసారి ఎన్నికల్లో జనసేన బలిపశువు కాబోదని ఆయన స్పష్టం చేశారు.కొంతమంది జనసైనికులు కోరుతున్నట్లుగా ఒంటరిపోరు అంత సులభం కాదని ఆయన తేల్చేశారు. క్షేత్రస్థాయిలో సమాచారం తెప్పించుకుని, అధ్యయనం చేసి, జనసేన గెలుస్తుందంటే ఒంటరిగా వెళ్లడానికి నేను వెనుకాడనని చెప్పుకున్నారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవన్న జగన్ అందుకోసం కొంత సమయం ఆగాల్సి ఉంటుందన్నారు. 175 సీట్లలో విడిగా పోటీ చేయాలని సవాలు చేస్తున్న వైసీపీ అనుకున్నట్లుగా జరగదని పవన్ తేల్చేశారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని పవన్ మరోసారి స్పష్టం చేశారు.

ఈ సారి టీడీపీతోనే వెళ్లేందుకు పవన్ సిద్ధమవుతున్నప్పటికీ ఆ పార్టీ పట్ల తనకు విశ్వాసం లేదన్నట్లుగా మాట్లాడుతున్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనే లక్ష్యంలో తెలుగుదేశం అనేదే వచ్చేది కాదన్నారు. “టీడీపీ మీద నాకు ప్రత్యేక ప్రేమ లేదు. చంద్రబాబు మీద ఆరాధనా భావం లేదు. కానీ… ఆయనమీద గౌరవముంది. ఆయన సమర్థుడు” అని పవన్‌ పేర్కొన్నారు. టీడీపీతో పొత్తు… 20 సీట్లకే పవన్‌ పరిమితం… అంటూ వస్తున్న వదంతులు నమ్మవద్దని కార్యకర్తలకు ఆయన హితబోధ చేశారు. అందుకే ఈ సారి ప్రయోగాలు చేయబోనని కూడా ఆయన స్పష్టం చేశారు. టీడీపీతో పొత్తు ఉంటుందని పరోక్షంగా అంటూనే..ఆ అవసరాన్ని బీజేపీ రాష్ట్ర నాయకత్వమే కల్పిస్తోందని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. అనుకున్నది జరిగి ఉంటే టీడీపీతో సంబంధం లేకుండా ఎదిగేవారమన్నారు.

బీజేపీపై అసంతృప్తి

మోదీ అంటే మొదటి నుంచి గౌరవమేనని చెప్పుకున్న పవన్ కల్యాణ్‌ బీజేపీ రాష్ట్ర శాఖపై మాత్రం విరుచుకుపడ్డారు. తన ప్రతిపాదనలకు ఢిల్లీలో తలూపిన నాయకులు సాయంత్రానికి మార్చారన్నారు. ఏ పనికి కలిసిరాకపోతే తాను మాత్రం ఏం చేయగలనని పవన్ ప్రశ్నించారు.

మగతనం చూపిస్తా..

వైసీపీ నాయకులు తన మగతనం గురించి మాట్లాడడంపై పవన్ ఆగ్రహావేశాలకు లోనయ్యారు. ‘మీకు మగతనం చూపించాలా? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడిన ప్రతి మాటకూ శిస్తు కట్టిస్తాం’ అని పవన్‌ హెచ్చరించారు. దోపిడీ చేసిన సొమ్ముతో మదమెక్కి మాట్లాడుతున్నారన్నారు. “మీ మదం ఎలా తగ్గించాలో మాకు తెలు సు. వైసీపీ వాళ్లు తొడలు ఎక్కువ కొడుతున్నారు. రెండు తొడలు బద్ధలు కొట్టి కింద కూర్చోబెడతాం” అని హెచ్చరించారు.