అన్న తిరుగుబాటు తమ్ముడు సస్పెన్షన్

నెల్లూరు వైసీపీలో వింతలు జరుగుతున్నాయి. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బజారున పడి తిట్టుకుంటున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అయిన రెబెల్ స్టార్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అనిల్ ఇలాకాలో హల్ చల్ చేసేందుకు కోటంరెడ్డి ప్రయత్నిస్తున్నారు.

శ్రీధర్ రెడ్డిపై సీరియస్

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై వైసీపీ అధిష్టానం సీరియస్‌గా ఉంది. పార్టీ నుంచి పూర్తిగా వైదొలగకుండా ఆయన నానా యాగీ చేస్తున్నారని ఆగ్రహం చెందుతోంది. పార్టీకి పూర్తిగా దూరమైన ఆయన టీడీపీలో చేరతారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

గిరిధర్ రెడ్డి సస్పెన్షన్

తాజాగా శ్రీధర్ రెడ్డి సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిపై వైసీపీ అధిష్టానం వేటు వేసింది. రాష్ట్ర సేవాదళ్ అధ్యక్ష పదవి నుంచి ఆయన్ను తొలగించింది. బాధ్యతలు అప్పగించిన కొద్ది నెలలకే ఆ పదవి నుంచి తొలగించారు.

నిజానికి శ్రీధర్ రెడ్డిని పక్కన పెట్టాలని నిర్ణయించుకున్న తర్వాత గిరిధర్‌ను ప్రోత్సహించాలని వైసీపీ అధిష్టానం నిర్ణయించింది. నెల్లూరు రూరల్ టికెట్ కూడా ఆయనకే ఇవ్వాలని భావించిందట. అయితే గిరిధర్ రెడ్డి అధిష్టానం ఆలోచనను అమలు చేయకుండా అన్నయ్య శ్రీధర్ రెడ్డి బాటలో నడుస్తున్నారట. దానితో ఆగ్రహించిన అధిష్టానం ఆయన్ను సస్పెండ్ చేసింది.

కామెడీ టైమ్

తాజా సస్పెన్షన్‌ వైసీపీ వర్గాల్లోనే కామెడీలకు అవకాశం ఇచ్చింది. పార్టీని వదిలేసి దూరంగా జరిగిన వారిని ప్రత్యేకంగా సస్పెండ్ చేయడమేంటని కొందరు జోకులేసుకుంటున్నారు. అంతా జగన్మాయ అని చెప్పుకుంటున్నారు..