సంద‌డి లేని వైసీపీ ‘ఆవిర్భావం’!

ఏపీ అధికార పార్టీ వైసీపీ ఆవిర్భ‌వించి నేటికి 12 ఏళ్లు పూర్త‌య్యాయి. నిజానికి వైసీపీలో ఏదైనా కార్య‌క్ర‌మం అంటే.. పార్టీ నాయ‌కులు.. అభిమానులు పెద్ద ఎత్తున సంద‌డి చేస్తారు. బాణాసంచా కాల్చి.. మిఠాయిలు పంచుకుని..కేకులు క‌ట్ చేసి.. అబ్బో పెద్ద ఉత్స‌వాలే నిర్వ‌హిస్తారు. అలాంటి ఇప్పుడు మాత్రం రాష్ట్రంలో ఎక్క‌డా సంద‌డి క‌నిపించ‌డం లేదు. ఎవ‌రూ మాట్లాడ‌డ‌మే లేదు. ఆఖ‌రుకు సీఎం జ‌గ‌న్ కూడా ఓల్డ్ వీడియో ఒక‌టి ట్విట్ట‌ర్‌లో పెట్టి ఊరుకున్నారు.

ఇక‌, పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు.. స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మాత్రంతాడేప‌ల్లిలోని కేంద్ర కార్యాల‌యంలో కేక్ క‌ట్ చేసి.. ఆవెంట‌నే వెళ్లిపోయారు ఇక‌, రాష్ట్రంలో ఎక్కడా కూడా నాయ‌కులు కేకులు క‌ట్ చేసింది లేదు.. పార్టీ గురించి కామెంట్లు చేసింది అంత‌కన్నా లేదు. మ‌రి దీనికి కార‌ణం ఏంటి? ఎందుకు? అనేది ఆస‌క్తిగా మారింది. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉంద‌ని..అందుకే పార్టీ ఆవిర్భావ దినోత్స‌వం నిర్వ‌హించ‌డం లేద‌ని.. కొంద‌రు చెబుతున్నారు.

కానీ, గ‌త ఏడాది ఇదే స‌మ‌యంలో తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక జ‌రిగింది. అప్పుడు అక్క‌డ కూడా ఎన్నిక‌ల కోడ్ ఉంది. అయినా..కూడా ఈ కార్య‌క్ర‌మాన్ని ఘ‌నంగా నిర్వహించారు. అదేవిధంగా కార్పొరేష‌న్ ఎన్నిక‌ల కోడ్ ఉన్న చోట్ల కూడా నిర్వ‌హించారు. కానీ ఇప్పుడు మాత్రం దీనిని ప‌క్క‌న పెట్టారు. దీనిపై విప‌క్ష నాయ‌కులు మ‌రో వాద‌న చేస్తున్నారు. ప్ర‌స్తుతం వివేకానంద‌రెడ్డి కేసు విచార‌ణ ఊపందుకోవ‌డం.. కీల‌క‌మైన నాయ‌కుడు సీఎం జ‌గ‌న్ త‌న‌కు త‌మ్ముడు అని పిలిచే ఎంపీఅవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగిస్తున్న నేప‌థ్యంలో అంద‌రూ దానిపైనే దృష్టి పెట్టి ఉంటార‌ని టీడీపీ నేత‌లు చెబుతున్నారు.

అందుకే పార్టీ ఆవిర్భావ దినోత్స‌వాన్ని మ‌రిచిపోయార‌ని చెబుతున్నారు. మ‌రోవైపు.. పార్టీలోనూ ఎవ‌రూ సంతోషంగా లేర‌ని.. కీల‌క నేత‌లు కూడా అవ‌మానాలు జ‌రుగుతున్నాయ‌ని.. అందుకే ఎన్నిక‌ల కోడ్ లేని జిల్లాల్లో కూడా పార్టీ ఆవిర్భావ దినోత్స‌వం నిర్వ‌హించ‌డం లేదేని అంటున్నారు. మొత్తానికి వైసీపీ ఆవిర్భావ దినోత్స‌వంలో ఎలాంటి సంద‌డి లేక‌పోవ‌డం ప‌ట్ల కూడా చ‌ర్చ జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం.