కోడెల శివప్రసాద్ టీడీపీ అధికారంలో ఉండగా కీలకంగా ఉండేవారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో ఆయనకు ఎదురేలేని పరిస్థితి. కానీ.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అంతా తారుమారైంది. కొద్దికాలానికే ఆయన ఆత్మహత్య చేసుకుని మరణించారు. కోడెల తనయుడు శివరామ్ ఇప్పుడు సత్తెనపల్లి నుంచి టీడీపీ టికెట్ ఆశిస్తున్నప్పటికీ ఆయనకు టికెట్ ఇవ్వడం వల్ల ప్రయోజనం లేదన్న ఉద్దేశంతో పార్టీ ఏమాత్రం అనుకూలంగా లేదు. కానీ, పార్టీకి సుదీర్ఘ కాలం సేవలందించిన కోడెల శివప్రసాద్ తనయుడిగా… బలవన్మరణం పొందిన సీనియర్ నేత తనయుడిగా పార్టీకి ఆయనపై కొంత సింపథీ ఉంది. కానీ, కోడెల శివరామ్‌పై ప్రజల్లో అలాంటి సింపథీ ఏమీ లేదని పార్టీ సర్వేలలో ప్రతిసారీ తేలుతోంది. దీంతో ఎన్నికల నాటికి ఎలాగైనా ఆయనకు నచ్చజెప్పి ఇతరులకు టికెట్ ఇవ్వాలని కోరుకుంటోంది టీడీపీ.
కానీ కోడెల శివరాం మాత్రం నియోజకవర్గంలో విస్తృతంగా తిరుగుతున్నారు. మరణించిన తన తండ్రి ఆశయ సాధనకు సత్తెనపల్లి నుంచి గెలిచి పనిచేస్తానని చెప్తున్నారు. టీడీపీలో పరిస్థితులు మాత్రం అందుకు ఏమాత్రం అనుకూలంగా లేవు. ఇటీవలే బీజేపీ నుంచి మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరడంతో ఆయనకు సత్తెనపల్లి టికెట్ ఖాయమన్న ప్రచారం జరుగుతోంది.
ఈ సమయంలోనే కోడెల శివరాంపై వైసీపీ నుంచి ఆరోపణలు పెరుగుతుండడం… కేసులు పెడుతుండడంతో ఆయనకు టికెట్ రావడం కష్టమేనంటున్నారు. ముఖ్యంగా తాజాగా ఆయనపై తెనాలిలో చీటింగ్ కేసు నమోదైంది. తన కంపెనీలో తమ చేత పెట్టుబడి పెట్టంచి శివరాం మోసం చేశాడంటూ బాధితులు కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశామంటున్నారు ఏపీ పోలీసులు.
2016లో పెట్టుబడి రూపంలో… శివరామ్ కు చెందిన కైరా కంపెనీలో 2016లో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పాలడుగు బాలవెంకట సురేష్ 25 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టుబడి పెట్టారు. వీరితో పాటు మరో ముగ్గురు కోటి రూపాయల వరకూ కోడెల శివరాం కంపెనీలో పెట్టుబడిగా పెట్టారు. చెక్కుల ద్వారానే ఈ మొత్తాన్ని చెల్లించారు. మరుసటి ఏడాది పెట్టుబడి ఫలితం ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ శివరాం అతని భార్య ఎంతకూ డబ్బులు చెల్లించకపోవడంతో బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
కాగా ఇది బయట పరిష్కరించుకునే వ్యాపార వ్యవహారమే అయినా వైసీపీ ప్రోద్బలంతో కేసు పెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కారణమేదైనా ఇలాంటి కేసులు, ఇతర వ్యవహారాలను టీడీపీ అధిష్ఠానం ముందుకు పెట్టి కోడెల శివరాంకు టికెట్ నిరాకరించే అవకాశాలున్నాయని అంటున్నారు. కోడెలకు టికెట్ ఇవ్వకుండా తప్పించుకోవాలన్న టీడీపీ అధిష్టానం కోరికకు వైసీపీ పనులు సాయపడుతున్నాయని సత్తెనపల్లి రాజకీయవర్గాలలో వినిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates