ఏపీలో జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ప్రాణసంకటంగా పరిణమించాయనే వాదన వినిపిస్తోంది. ఎందుకంటే.. ఇటు బీజేపీ.. అటు టీడీపీ రెండూ కూడా.. జనసేన తమకంటే తమకే మద్దతు ఇస్తోందని చెబుతున్నాయి. తాజాగా పార్టీ నాయకులతో మాట్లాడిన చంద్రబాబు.. జనసేన కార్యకర్తలను, నేతలను కలుపుకొని ముందుకు సాగాలని పార్టీ నేతలకు సూచించారు.
అంతేకాదు.. అవసరమైతే.. జనసేన నేతల ఇళ్లకు వెళ్లి వారిని కలుపుకొని ముందుకు సాగాలని చంద్రబాబు చెప్పారు. అయితే.. జనసేన అధినేత నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదు. దీంతో జనసేన నాయకులు ఎవరూ కూడా.. టీడీపీతో కలిసి ముందుకు నడిచే పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. ఇక, మరోవైపు.. బీజేపీ కూడా.. తమకు మద్దతు జనసేనేనని.. పొత్తులో భాగంగా.. తమకు అనుకూలంగా జనసేన ఉంటుందని.. ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
తాజాగా ఉత్తరాంధ్ర, రాయలసీమ నేతల సమావేశాల్లో బీజేపీ నేతలు.. ముఖ్యంగా బీజేపీ జాతీయకార్యదర్శి, ఏపీ వ్యవహారాల సహ ఇంచార్జ్‌గా ఉన్న సునీల్ దేవ్‌ధర్ కూడా పవన్ పేరు ఎత్తకుండానే జనసేనతో కలిసి ముందుకు సాగాలని.. బీజేపీ పొత్తు జనసేనతోనే ఉందని అందుకే ఆ పార్టీ నాయకులను కలుపుకొని పోవాలని ఆయన సూచించారు. దీంతో బీజేపీ నాయకులు చాలా ఉత్సాహంగా ముందుకు కదులుతున్నారని.. సోము వీర్రాజు కితాబు ఇచ్చారు.
అయితే.. అటు బీజేపీ, ఇటు టీడీపీ ఇలా జనసేన కార్డును వాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నా.. పవన్ కళ్యాణ్ మాత్రం తాను ఎవరికి మద్దతివ్వాలి.. అనేది మాత్రం చెప్పలేక పోతున్నారు. సార్వత్రిక సమరానికి సెమీ ఫైనల్‌గా భావిస్తున్న ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పవన్ వ్యూహం ఏంటనేది తెలియక మరోవైపు కార్యకర్తలు కూడా తల్లడిల్లుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి పవన్ ఏం చేస్తారో చూడాలి.