విశాఖపట్నమే పాలనా రాజధాని అని సీఎం జగన్ మరోసారి సంచలన ప్రకటన చేశారు. అంతేకాదు.. తా ను త్వరలోనే విశాఖకు వచ్చేస్తున్నట్టు చెప్పారు. తన మకాం.. పాలన అంతా కూడా .. విశాఖ నుంచే జరు గుతుందని తేల్చి చెప్పారు. విశాఖలోని ఆంధ్రా వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు ప్రారంభమైంది. రాష్ట్రానికి రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని, 340 సంస్థలు పెట్టుబడులకు ఆసక్తి చూపించాయని సీఎం జగన్ వెల్లడించారు.
20 కీలక రంగాల్లో 6 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. సదస్సు మొదటి రోజు 92 ఏంవోయూలు కుదుర్చుకున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో అపార అవకాశాలు, అంతకు మించిన మానవ వనరులు ఉన్నట్లు తెలిపారు. అయితే.. ఈ సందర్భంగా సీఎం జగన్ రాజధానిపై మరోసారి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే రాజధాని నగరంగా విశాఖ ఏర్పడుతుందన్నారు.
పలువురు కేంద్రమంత్రులు, పారిశ్రామికవేత్తలు సహా వివిధ దేశాల రాయబారులు, వాణిజ్య ప్రతినిధులు హాజరైన ఈ సదస్సులో నే సీఎం జగన్ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక, ఈ సదస్సుకువచ్చిన వారిలో రిలయన్స్ గ్రూపు అధినేత ముఖేష్ అంబానీ, భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ కృష్ణ ఎల్ల, జీఎంఆర్ గ్రూపు అధినేత జి.మల్లికార్జునరావు, సైయంట్ అధినేత మోహన్‌రెడ్డి, అదానీ పోర్ట్స్ సీఈవో కరణ్ అదానీ తదితర ప్రముఖులు ఉన్నారు.
పెట్టుబడి దారుల సదస్సు సందర్భంగా ఏపీలో పారిశ్రామిక వనరులపై రాష్ట్ర ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. ఆయా రంగాల్లో అందుబాటులో ఉన్న వనరులు, రవాణా సౌకర్యాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలపై డాక్యుమెంటరీ ప్రదర్శించింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates