ఆ ముగ్గురికి టికెట్ ఖాయం !

వైసీపీ నుంచి బయటపడేందుకు చాలా మంది రెడీగా ఉన్నారు. కొంతమంది బయటకు చెప్పడం లేదు. మరికొంత మంది మాత్రం వైసీపీ అధిష్టానాన్ని నేరుగానే విమర్శిస్తూ బయటకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. వీలైతే జగనే తమను వెలివేయాలని తద్వారా కొంత రాజకీయ ప్రయోజనం పొందొచ్చని ఎదురు చూస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్లో మారుతున్న సమీకరణాలను చూసుకుని కొందరు వైసీపీ నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు టీడీపీ అధినాయకుడు చంద్రబాబు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దానితో టైమ్ వచ్చినప్పుడు పార్టీ మారేందుకు ఆయా నేతలు రెడీగా ఉన్న మాట వాస్తవం.

చాలా రోజులుగా స్వపక్షంలో విపక్షంగా ఉన్న నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు రోజువారీ రచ్చబండ నిర్వహిస్తూ జగన్ ప్రభుత్వాన్ని తూర్పార పడుతున్నారు. కేసుల మీద కేసులు పెడుతున్నారు. ఆయన్ను పొమ్మనలేక పొగపెట్టినా ఎన్నికల వరకు ఎక్కడికి వెళ్లేదిలేదు, విమర్శించకుండా ఉండేది లేదన్నట్లుగానే ప్రవర్తిస్తున్నారు..

ఇక నెల్లూరు పెద్దారెడ్లు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పటికే జగన్ టీమ్ నుంచి బయటపడ్డారు.వారి నియోజకవర్గాల్లో కొత్త ఇంఛార్జ్ లను కూడా నియమించారు. ఏదో నామ్ కే వాస్తే వాళ్లు వైసీపీలో కొనసాగుతుండగా ఎన్నికల వేళ పచ్చ కండువా కప్పుకుంటారని స్పష్టమైంది.

ట్రిపుల్ ఆర్, కోటంరెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డికి వారి వారి నియోజకవర్గాల్లో చంద్రబాబు టికెట్లు ఖాయం చేశారట. రఘురామ నర్మగర్భంగా ఈ విషయాన్ని వెల్లడించగా, ఆ మాట నిజమేనని టీడీపీ వర్గాలు ధృవీకరించాయి. అందుకే అనేక కారణాలు కూడా ఉన్నాయి. రఘురామను వైసీపీ ప్రభుత్వం అవమానపరిచిన తీరుతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో రాజులకు బాగా కోపమొచ్చింది. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా ఓటు వేయకూడదని వాళ్లు నిర్ణయించుకున్నట్లు సమాచారం. రాజులను వంద శాతం తమవైపుకు తిప్పుకోవలంటే నర్సాపురం లోక్ సభా టికెట్ రఘురామకు ఇచ్చి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని టీడీపీ భావిస్తోంది.

జగన్ , రెడ్డి సామాజికి వర్గానికి చెందిన నాయకుడైనప్పటికీ వైసీపీలో రెడ్లు ఉక్కపోతను ఎదుర్కొంటున్నారు. పైగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే నెల్లూరు పెద్దారెడ్లను జగన్ ఇబ్బందిపెట్టి అవమానపరిచారన్న చర్చ జరుగుతోంది. దానితో సింహపురి రెడ్డీస్ టీడీపీ వైపు చూస్తున్నారట. అందుకే వైసీపీ రెబెల్స్ ఆనం, కోటంరెడ్డికి టికెట్లు ఇచ్చేస్తే ఒక పనైపోతుందని చంద్రబాబు భావిస్తున్నారు. అంటే నెల్లూరు రూరూల్, వెంకటగిరి నియోజకవర్గాలు బయట నుంచి వచ్చిన వారికి ఇవ్వడం ఖాయమైంది. ఈ దిశగా టీడీపీ క్షేత్రస్థాయి కేడర్ ను కూడా ఒప్పిస్తున్నట్లు సమాచారం.