చంద్రబాబు చెప్పిన జగన్ రాజకీయం

ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీల హడావుడి చూస్తుంటే అసెంబ్లీ ఎన్నికలు వచ్చినట్లేననిపిస్తోంది.ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధమంటున్న పార్టీలు ఇప్పుడే వచ్చేస్తే బావుండునన్నంత కసిగా ఉన్నాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ బస్తీమే సవాల్ అంటున్నాయి. వీధిపోరాటాలు, దాడులు, కేసులు, జైళ్లు ఇలా ప్రత్యర్థి పార్టీలు బిజీగా ఉంటున్నాయి. ఈ ప్రక్రియ ఒక పక్క సాగుతుండగానే మరో పక్క అంతర్లీనంగా ఎన్నికల సన్నాహాలు జరిగిపోతున్నాయి.

వైసీపీ అధినేత, సీఎం జగన్ అన్ని వైపుల నుంచి నరుక్కు వస్తున్నారు. పార్టీ నేతలను జనంలో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు. గడప గడపకు ప్రతిఘటన ఎదురైనా ఎవరూ వెనుకంజ వేయకూడదని ఆదేశిస్తున్నారు. నాయకుల్లో ఉత్సాహం నింపేందుకు, వారిని జనంలో తిప్పేందుకు ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా వైసీపీకి బాగానే ఉపయోగపడుతున్నాయి.

వైసీపీ నేతల్లో కొంత అసంతృప్తి నెలకొంది. పనులు చేయలేకపోతున్నామని, జనం తమను వ్యతిరేకిస్తున్నారని వైసీపీ వాళ్లు ఆందోళనలో ఉన్నాయి. అలాంటి సమస్యల నుంచి డైవర్షన్ కోసం జగన్ చాలా ఎత్తుగడలే వేస్తున్నారు. అందులో భాగంగా ఎన్నికలకు సిద్ధం కావాలన్నట్లుగా సందేశాలిస్తున్నారు. దానితో టికెట్ వస్తే ఏం చేయాలి, ఎలా చేయాలన్న ఆలోచనే వారిలో టెన్షన్ పుట్టిస్తోంది.

బాబు ఏమన్నారు..

బీజేపీకి రాజీనామా చేసిన కన్నా లక్ష్మీ నారాయణ గురువారం టీడీపీలో చేరారు. ఆయనతో పాటు మూడు వేల మంది వచ్చి పచ్చ కండువా కప్పుకున్నట్లు అంచనా వేస్తున్నారు. జగన్ ప్రభుత్వ తీరుపైనా, రాక్షస పాలనపైనా కన్నా దుమ్మెత్తి పోశారు.

కన్నా చేరిన సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. ఎన్నికల్లో జగన్ చేయబోయేదేమిటో నేరుగానే చెప్పేశారు. అవినీతి సొమ్మును ఎలా, ఎంత వ్యయం చేయబోతున్నారో వివరించారు. ప్రతీ ఎమ్మెల్సే ఇందు కోసం యాభై కోట్ల రూపాయలు సేకరించారని అన్నారు. ఇప్పటికే డబ్బు జమ చేసుకుని ఉన్నారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలకు పంచేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. ఇందుకోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. నియోజకవర్గంలో ఎక్కడ ఎంత పంచాలో కూడా లెక్కలు సిద్ధమైనట్లు చెబుతున్నారు.

ప్రజాదరణ లేకే..

జగన్ కు ప్రజాదరణ లేదని చంద్రబాబు తేల్చేశారు. సీఎంను చూస్తే జనం ఛీకొడుతున్నారని చెప్పారు. ఎన్నికల తర్వాత జగన్ జైలుకు, వైసీపీ బంగాళాఖాతానికి వెళ్లడం ఖాయమన్నారు. అలాంటి పరిస్థితి నుంచి బయట పడేందుకు ప్రతీ ఎమ్మెల్యే నియోజకవర్గానికి యాభై కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమయ్యారని చెప్పుకొచ్చారు.అయినా ప్రయోజనం లేదని జగన్ ను ఓడించేందుకు జనం సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు జోస్యం చెబుతున్నారు..