వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ సీఎం జగన్ భార్య వైఎస్ భారతి పోటీ చేస్తారన్న ప్రచారం కడప జిల్లాలో జరుగుతోంది. జగన్ సొంత జిల్లా అయిన కడపలోని జమ్మలమడుగు నుంచి ఆమె పోటీచేస్తారన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే పులివెందుల నియోజకవర్గం జగన్ కుటుంబానికి కంచుకోట కాగా దానికి అదనంగా జమ్మలమడుగును కూడా కంచుకోటగా మార్చుకునేందుకు గాను పావులు కదుపుతున్నారని… అందులో భాగంగానే అక్కడి నుంచి భారతిని బరిలో దించుతారని తెలుస్తోంది.
కడప జిల్లాలో ఏర్పాటుచేస్తున్న స్టీల్ ప్లాంట్ కూడా జమ్మలమడుగులోనే రానుంది. జమ్మలమడుగు మండలం సున్నపరాళ్లపల్లిలో జగన్ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటైన తరువాత ఈ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసే యోచనలో ఉన్నారు. జమ్మలమడుగులో విమానాశ్రయ ఏర్పాటుకూ ప్రతిపాదన ఉంది. ఈ క్రమంలోనే అభివృద్ధి చెందనున్న జమ్మలమడుగు నుంచి భారతి ఎన్నికైతే ఆ నియోజకవర్గాన్ని పూర్తిగా తమ కుటుంబ నియోజకవర్గంగా మార్చుకోవచ్చనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం జమ్మలమడుగు నుంచి వైసీపీ నేత డాక్టర్ సుధీర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడి నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసిన ఆదినారాయణరెడ్డి ప్రస్తుతం టీడీపీలో ఉండగా… రామసుబ్బారెడ్డి వైసీపీలో ఉన్నారు. ఈ ఇద్దరు నేతల మధ్య చిరకాల వైరం ఉంది. ప్రస్తుతం ఆదినారాయణ రెడ్డి నిత్యం ప్రజల్లో ఉంటూ వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. వైసీపీ సర్వేలలో ఆదినారాయణ రెడ్డికి విజయావకాశాలు ఉన్నట్లు తేలిందని వైసీపీ వర్గాల నుంచే వినిపిస్తోంది. దీంతో ఎలాగైనా జమ్మలమడుగులో పాగా వేసేందుకు భారతిని రంగంలో దించాలని జగన్ భావిస్తున్నారట.
అయితే… ప్రస్తుతం వైసీపీలో టికెట్ ఆశిస్తున్న రామసుబ్బారెడ్డి అసంతృప్తి చెందకుండా ఆయనకు ఎమ్మల్సీ సీటు ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates