రెండు రోజుల కిందట బీజేపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ చాలామంది అనుకుంటున్నట్లు జనసేనలో చేరడం లేదట. ఆయన టీడీపీలో చేరుతారని తెలుస్తోంది. ఫిబ్రవరి 23న ఆయన చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతారని అనుచరులు చెప్తున్నారు.
మరోవైపు ఆదివారం ఆయన తన అనుచరులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. టీడీపీలో చేరితేనే కన్నా స్థాయికి గౌరవం దక్కుతుందని అనుచరులు కూడా అభిప్రాయపడడంతో ఆయన అనుచరుల నిర్ణయాన్ని అంగీకరిస్తూ టీడీపీలో చేరేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది.
2014లో బీజేపీలో చేరిన ఆయనకు పార్టీ 2019 ఎన్నికలకు కొద్దినెలల ముందు పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చింది. ఆ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేయగా 175 నియోజకవర్గాలలోనూ బీజేపీ అభ్యర్థులను నిలిపారు కన్నా.
అంతేకాదు… అమరావతి విషయంలో ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న అనాలోచిత, అజ్ఞాన నిర్ణయాలకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేశారు. అయితే…. పార్టీ అధ్యక్ష పదవి నుంచి కన్నాను తప్పించి సోము వీర్రాజుకు బాధ్యతలు అప్పగించిన తరువాత పరిస్థితులు మారాయి. సోము వీర్రాజుకు, కన్నాకు ఏమాత్రం పొసగలేదు.
దీంతో కన్నా డైరెక్టుగానే వీర్రాజుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్‌కు ఓపెన్‌గా మద్దతు పలికారు. దీంతో ఆయన జనసేనలో చేరుతారని చాలామంది భావించారు. కానీ, ఆయన టీడీపీలో చేరడానికి ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది.
గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేయడానికి అంతా సిద్ధమైనట్లు తెలుస్తోంది. పార్టీ అధినేత చంద్రబాబు నుంచి అందుకు హామీ కూడా లభించినట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీలో 23వ తేదీన చేరిన తరువాత ఆయన లోకేశ్ యువగళం పాదయాత్రలోనూ పాల్గొంటారని అనుచరులు చెప్తున్నారు.