అన‌ప‌ర్తి ఘ‌ట‌న‌.. అంతా టీడీపీనే చేసిందట

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలోని అన‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు ఎంత అగౌర‌వం జ‌రిగిందో అంద‌రికీ తెలిసిందే. క‌నీసం.. జ‌డ్ ప్ల‌స్ భ‌ద్ర‌త‌లో ఉన్న ఆయ‌న న‌డుచుకుంటూ వెళ్లినా.. పోలీసులు ప‌ట్టించుకోలేదు. ఇక‌, ఆయ‌న ప్ర‌సంగించేందుకు కూడా అనుమ‌తి ఇవ్వ‌లేదు. కాద‌ని… ప్ర‌సంగించిన చంద్ర‌బాబు పోలీసుల‌పై నిప్పులు చెరిగిన విష‌యం తెలిసిందే. అయితే.. బాబు స‌భ ముగియ‌గానే ఆయ‌న ప్ర‌సంగించిన వాహ‌నాన్ని.. మైకును కూడా స్వాధీనం చేసుకుని పోలీసు స్టేష‌న్‌కు త‌ర‌లించారు.

అయితే.. ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఈ నేప‌థ్యంలో తాజాగా తూర్పు ఎస్పీ రంగంలోకి దిగి.. త‌మ వైపు త‌ప్పు ఏమీ లేద‌ని.. అంతా టీడీపీనే చేసింద‌ని వివ‌ర‌ణ ఇచ్చారు. త‌మ పోలీసుల‌ను స‌మ‌ర్ధించుకున్నారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు సభకోసం అనుమతికావాలని కోరారని.. ఎస్పీ తెలిపారు. అయితే, పోలీస్‌యాక్ట్‌, జీవో నంబర్‌-1 అనుసరించి రోడ్డుపై ఎలాంటి బహిరంగ సభలకు అనుమతిలేదని చెప్పామ‌న్నారు.

వచ్చిపోయే వాహనాలకు ఇబ్బంది కలగకుండా ర్యాలీ నిర్వహించుకోవచ్చంటూ నిబంధనలను వారికి తెలియజేశామ‌ని ఎస్పీ వివ‌రించారు. ప్రతిపక్ష నాయకులు సభను నిర్వహించుకునేందుకు అనుకూలం గా ఉండే రెండు బహిరంగ ప్రదేశాలను కూడా తామే టీడీపీకి స‌జ్జ‌స్ట్ చేసిన‌ట్టు ఎస్పీ చెప్పుకొచ్చారు. కళాక్షే త్రంతోపాటు, ఒక లే అవుట్‌లో బహిరంగ సభ నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చని సూచించామ‌న్నారు. అంతేకాకుండా తగిన భద్రతనుకూడా కల్పిస్తామని వివరించిన‌ట్టు తెలిపారు.

పోలీసుల‌ విజ్క్షప్తిని టీడీపీ నేత‌లు తోసిపుచ్చారు. పోలీసు సూచనలను పట్టించుకోలేదు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించి నడిరోడ్డుపై సభ నిర్వహించారు. జీవో-1 కు విరుద్ధంగా నడుచుకున్నారు. ఈ ఘటనలో చట్టాలను,నిబంధనలను ఉల్లంఘించిన వారిపై పోలీసు యంత్రాంగం చట్టంప్రకారం చర్యలు తీసుకుంటుంది. ఈ మొత్తం ఘ‌ట‌న‌కు టీడీపీనే బాధ్య‌త వ‌హించాలి అని ఎస్పీ కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు.