“ఒక విషయం చెబుతున్నా.. బాగా గుర్తుంచుకోండి. వచ్చే ఎన్నికల్లో కూడా కల్లబొల్లి కబుర్లు చెబుతారు. అరచేతిలో వైకుంఠం చూపిస్తారు. వారి మాటలు విని.. వారిని నమ్మి .. మీరు మరోసారి ఫ్యాన్‌కు ఓటేస్తే.. వారు తిరిగి అధికారంలోకి వచ్చాక.. అదే ఫ్యాన్‌కు మిమ్మల్ని ఉరేస్తారు”- అని టీడీపీ అదినేత చంద్రబాబు హెచ్చరించారు. జగన్‌ను నమ్మి ఒకసారి ఓటేసి.. రాష్ట్రాన్ని 30 ఏళ్ల వెనక్కి నెట్టేశారని.. విరుచుకుపడ్డారు. ఏం చూసి ఓటు అడుగుతారని.. వైసీపీ నేతలను ఆయన ప్రశ్నించారు.
వైసీపీ ప్రభుత్వం మహిళలను మోసం చేసిందన్నారు. మహిళా శక్తిని జగన్ తక్కువగా అంచనా వేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సైకో వల్ల రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని చంద్రబాబు విమర్శించారు. ఏపీలో నిత్యావసరాలు విపరీతంగా పెరిగిపోయాయని అన్నారు.
ప్రస్తుతం ప్రజల సమస్యలకు జగన్ రెడ్డి మాత్రమే కారణమని మండిపడ్డారు. జగ్గంపేట రోడ్ షోలో చంద్రబాబు మాట్లాడుతూ సైకోను ఇంటికి పంపించకపోతే.. మీరంతా ఫ్యాన్‌కు ఉరి వేసుకోవాలని అన్నారు.
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగన్‌ను చిత్తు చిత్తుగా ఓడించి ఇంటికి పంపించేందుకు సిద్ధంగా ఉండాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. కడపలో స్టీల్ ప్లాంట్‌కు ఈరోజు రెండోసారి శంకుస్థాపన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతకు ముందు తూర్పుగోదావరి జిల్లాలోని గుమ్మళ్లదొడ్డిలో చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. చెత్తమీద పన్ను వేసిన ఘనత జగన్‌కే చెల్లుతుందని చంద్రబాబు మండిపడ్డారు. మగవారితో సమానంగా ఆడబిడ్డలు రాణిస్తున్నారని, ఆడబిడ్డలకు ఎన్టీఆర్ సమాన హక్కు కల్పించారని చంద్రబాబు అన్నారు. బాదుడే బాదుడుతో జగన్ ప్రజలను దోచుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. సైకో పోవాలి.. సైకిల్ రావాలని ప్రజలతో నినాదాలు చేయించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates