రోటీన్ కు భిన్నంగా నిర్ణయాలు తీసుకునే ముఖ్యమంత్రిగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి పేరుంది. రాష్ట్రం అప్పుల కుప్పలా మారి.. ప్రభుత్వ ఉద్యోగులకు నెల మొదటి రోజు జీతాలు ఇవ్వలేని దైన్య పరిస్థితుల్లోనూ.. సంక్షేమ కార్యక్రమాల్ని బటన్ నొక్కి మరీ లబ్థిదారుల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బుల్ని పంపించే సీఎంగా ఆయన పేరు గడించారు. తన పాలనకు వేరే వారు మార్కులు వేయటం ఏమిటి? మనమే వేసుకుందామన్నట్లుగా ఆయన తీరు ఉంటుందన్న సంగతి తెలిసిందే.
ఎవడి డప్పు వాడు కొట్టుకోవాల్సిందే అన్న పాటలోని మాటను బలంగా నమ్మారేమో కానీ.. జగన్ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు ఇంచుమించు అదే ధోరణిలో ఉండటం గమనార్హం. ‘మా నమ్మకం నువ్వే జగన్’ పేరుతో స్టిక్కర్లను తయారు చేయించి..రాష్ట్రంలోని ప్రతి ఇంటికి అతికిస్తున్న జగన్ ప్రభుత్వం.. మరో అడుగు ముందుకు వేసి.. మొబైల్ ఫోన్ల వెనుక కూడా అదే తరహాలో చిన్న స్టిక్కర్లను తయారు చేయించి.. అతికించే ఏర్పాట్లను చేస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు బయటకు రావటంతో జనసేన స్పందించింది.
ఇదెక్కడి పిచ్చి అంటూ ఆ పార్టీ మండిపడింది. “ముఖ్యమంత్రి జగన్ కు పబ్లిసిటి పిచ్చి పరాకాష్ఠకు చేరుకుంది. ముఖ్యమంత్రి తన ప్రచారం కోసం ఇంటింటికీ స్టిక్కర్లు అంటించాలి. మన మొబైళ్ల మీద ఆయన ఫోటోలు వేయాలని ఆదేశించటం ఆశ్చర్యం కలిగిస్తోంది” అంటూ విస్మయాన్ని వ్యక్తం చేశారు నాదెండ్ల మనోహర్.
మన మొబైళ్లకు ఆయన స్టిక్కర్లు ఎందుకు వేయించుకోవటమన్న ఆయన.. “ముఖ్యమంత్రి ముందుగా తన మంత్రులు.. ఎమ్మెల్యేలకు పచ్చబొట్లు వేయించి ప్రజల్లోకి పంపాలి. ఆయనకు వారి మీద నమ్మకం లేదు కాబట్టి మేం వైసీపీ వాళ్లం. జగనన్నకు తోడుగా ఉంటాం. ఆయనంటే మాకుభరోసా అన్న మాటలు చెప్పిస్తే బాగుంటుంది” అంటూ ఎద్దేవా చేశారు. జగన్ సర్కారు వారి మొబైళ్ల వెనుక స్టిక్కర్లు వేయించే కార్యక్రమం రానున్న రోజుల్లో ప్రజల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యే అవకాశం ఉందంటున్నారు. మరి.. దీనిపై జగన్ సర్కారు ఎలా రియాక్టు అవుతుందో చూడాలి.