జ‌గ‌న్ ప్ర‌భుత్వం దివాలా దీసింది.. ఈ మాట ఎవ‌రన్నారంటే!

ఏపీలోని జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై అన్ని వ‌ర్గాల నుంచి విమ‌ర్శ‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. న్యాయ‌వ్య‌వ‌స్థ‌లో ప‌నిచేసిన మాజీ న్యాయ‌మూర్తుల నుంచి ప్ర‌జాస్వామ్య వాదుల వ‌ర‌కు కూడా ప్ర‌తి ఒక్క‌రూ సీఎం జ‌గ‌న్ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. తాజాగా కేంద్ర మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు దేవ్‌సింహ్‌ చౌహాన్ సైగా సీఎం జ‌గ‌న్ పాల‌న‌పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఏపీ ప్ర‌భుత్వం దివాలా తీసింద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీలో పాల‌న లేద‌ని అన్నారు. అనుభ‌వం లేని వారిని ఎన్నుకుని ప్ర‌జలు త‌ప్పు చేశార‌ని వ్యాఖ్యానించారు. ఎక్క‌డైనా ఏ ప్ర‌భుత్వ‌మైనా.. ప‌నిచేయించుకుని ఉద్యోగుల‌కు జీతాలు ఇవ్వ‌కుండా ఉండ‌లేద‌ని.. కానీ, జ‌గ‌న్ మాత్రం వారిని ఏడిపిస్తున్నార‌ని.. క‌నీసం 10వ తేదీ వ‌చ్చినా.. ఉద్యోగుల‌కు జీతాలు ఇవ్వ‌లేదంటే.. రాష్ట్రం దివాలా తీసిన‌ట్టు కాదా? అని నిప్పులు చెరిగారు.

ఏపీ ఆర్థిక పరిస్థితి బాగోలేదని.. పూర్తిగా దివాలా తీసిందన్నారు. వ‌లంటీర్ల ద్వారా విపక్ష నేతలను భయపెడుతున్నారని ఆరోపించారు. కర్నూలు జిల్లా ఆదోనిలో కేంద్ర మంత్రి చౌహాన్‌ మాట్లాడారు. ఏపీలో మద్యం, ఖనిజ సంపద ద్వారా వచ్చే ఆదాయంతో ప్రభుత్వం నడుస్తోందన్నారు. ఆ ఆదాయమంతా ఎక్కడికి పోతోందని ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు రోడ్ల మీద ఉన్నారని, వారి హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. 10వ తేదీ దాటినా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని దుయ్యబట్టారు. ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు.

మోడీకి కితాబులు..

ఒక‌వైపు సీఎం జ‌గ‌న్‌ను విమ‌ర్శించిన కేంద్ర మంత్రి చౌహాన్‌.. అదే స‌మ‌యంలో ప్ర‌ధాని మోడీపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. దేశంలో తొమ్మిదేళ్ల మోడీ పాలనలో అద్భుతాలు సృష్టించారని కేంద్రమంత్రి చౌహాన్‌ అన్నారు. సాంకేతికతతో కూడిన పారదర్శక పాలన అందిస్తున్నారని తెలిపారు. ఒక వ్యక్తి, ఒక వర్గం కాకుండా అందరూ ఎదగడానికి బీజేపీ కృషి చేస్తోందన్నారు. గతంలో యూపీఏ ప్రభుత్వం పేదల పేరుతో రాజకీయం చేసిందని విమర్శించారు.