యువ‌గ‌ళం వ‌ర్సెస్ స‌జ్జ‌ల స‌న్‌.. ఏం జ‌రుగుతోంది?

రాజ‌కీయాల్లో ఏమైనా జ‌ర‌గొచ్చు.. ఇప్పుడు అదే జ‌రుగుతోంది. టీడీపీ నేత‌లు చెబుతున్న‌ట్టుగా.. ప్ర‌స్తుతం ఆ పార్టీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ చేస్తున్న యువ‌గ‌ళం పాద‌యాత్ర‌కు.. ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్నారెడ్డి కుమారుడు భార్గ‌వ రెడ్డికి మ‌ధ్య ఏదో సంబంధం ఉందా? అంటే.. తాజాగా జ‌రుగుతున్న ప‌రిణామాల‌కు ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది.

అక్క‌డెక్క‌డో జ‌రుగుతున్న యువ‌గ‌ళం పాద‌యాత్ర‌కు, భార్గవ రెడ్డికి మ‌ధ్య రిలేష‌న్ ఏంటి? అనేది ఆస‌క్తిగా మారింది. ఇదే విష‌యాన్ని టీడీపీ నాయ‌కులు కూడా గ‌వ‌ర్న‌ర్‌కు ఫిర్యాదు చేశారు. ప్ర‌స్తుతం వైసీపీ సోష‌ల్ మీడియా ఇంచార్జ్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్న భార్గ‌వ రెడ్డి.. యువ‌గ‌ళం పాద‌యాత్ర‌పై త‌న‌దైన శైలిలో దృష్టి పెట్టార‌ని టీడీపీ నేత‌లు చెబుతున్నారు. అంటే.. ఒక‌వైపు యువ‌గ‌ళం హిట్‌.. సూప‌ర్ హిట్ .. అని టీడీపీ ప్ర‌చారం చేస్తోంది. ఇది వాస్త‌వం కూడా!

అయితే.. ఇదేమీ లేదు.. ఇది ఫ‌ట్‌! అని వ్య‌తిరేక ప్ర‌చారం చేయ‌డంలో వైసీపీ సోష‌ల్ మీడియా ఇంచార్జ్‌గా రాఘ‌వ‌రెడ్డి బాధ్య‌త‌లు తీసుకున్నార‌నేది టీడీపీ నేత‌ల ప్ర‌ధాన ఆరోప‌ణ‌. వైసీపీ అనుకూల మీడియాలోనూ ఇదే ప్ర‌చారం జ‌రుగుతోంది. ముఖ్యంగా యువ‌గ‌ళం జ‌రుగుతున్న ప్రాంతాల్లో పోలీసుల‌ను కూడా రాఘ‌వ‌రెడ్డే నియంత్రిస్తున్నార‌ని.. నిరంత‌రం వారితో ట‌చ్‌లోకి వ‌స్తున్నార‌ని.. వారిని ఆయ‌నే కంట్రోల్ చేస్తున్నారని కూడా టీడీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు.

అందుకే.. లోకేష్ ప్రసంగాలు హైలెట్ కాకుండా.. మైకులు లాగేయ‌డం.. సౌండ్ వాహ‌నాల‌ను స్వాధీనం చేసు కోవ‌డం వంటివి చేస్తున్నార‌ని కూడా జ‌రుగుతున్నాయ‌ని చెబుతున్నారు. ఇక‌, లోకేష్ పాద‌యాత్ర చేస్తున్న ప్రాంతాల‌కు దూరంగా డ్రోన్ కెమెరాల‌ను ఏర్పాటు చేసి.. వాటితో తీసిన నిర్మానుష్య ప్రాంతాల ఫొటోలు, వీడియోల‌ను ప్ర‌చారం చేయ‌డం ద్వారా యువ‌గ‌ళం పెద్ద‌గా సాగ‌డం లేద‌నే వ్య‌తిరేక ప్ర‌చారానికి తెర‌దీశార‌ని.. దీని వెనుక మాస్ట‌ర్ మైండ్ రాఘ‌వ‌రెడ్డేన‌న్న‌ది.. టీడీపీ నేత‌ల ప్ర‌ధాన ఆరోప‌ణ‌. మ‌రి ఇదినిజ‌మే.. అయితే.. ఇంత‌క‌న్నా.. దౌర్భాగ్యం ఉండ‌ద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.