వైసీపీలో ఎంపీల వ్యవహారం మరోసారి చర్చకు వచ్చింది. ఎన్నికలకు సమయం సమీపిస్తున్నా.. ఎంపీల్లో సగం మంది కూడా.. పుంజుకోవడం లేదు. ప్రజలను కలవడం లేదు. గడపగడప కార్యక్రమాన్ని తమది కానట్టే వ్యవహరిస్తున్నారు. ఒకరిద్దరు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదు. చిత్తూరు ఎంపీ రెడ్డప్ప.. మాత్రం గడపగడపకు తిరుగుతున్నారు. అయితే, ఈయనకు టికెట్ ఇవ్వబోమని.. పార్టీ అంతర్గతంగా నిర్ణయానికి వచ్చేసింది.
ఏమో మనసు మార్చుకునే అవకాశం ఉందేమో.. అని ఎంపీగారు మాత్రం ప్రజల మధ్యే ఉంటున్నారు. కుప్పంలో చంద్రబాబుకు చుక్కలు చూపించేందుకు తాను రెడీ అని ఆయన ప్రకటనలు చేస్తున్నారు. ఇక, మిగిలిన వారిలో అరకు ఎంపీ గొట్టేటి మాధవి.. ఊసు ఎక్కడా వినిపించడం లేదు. నిజానికి డౌన్ టు ఎర్త్ అనే విధంగా ఆమె సామాన్యురాలిగానే ఉన్నప్పటికీ.. పార్టీ పరంగా కానీ, పనుల పరంగా కానీ.. ఎక్కడా దూకుడు ప్రదర్శించడం లేదు. పార్లమెంటులోనూ ఆమె గళం వినిపించడం లేదు.
అదేవిధంగా బాపట్ల ఎంపీ నందిగం సురేష్ లోకల్ పాలిటిక్స్‌కే పరిమితమయ్యారు. నిజానికి ఎంపీగా ఉన్న ఆయన ఏ ఒక్క కార్యక్రమాన్నీ చేయలేకపోయారు. ఎంతో చేసే అవకాశం ఉన్నప్పటికీ బాషా సమస్య ఆయనను వేధిస్తోందట. పార్లమెంటులో ఇప్పటి వరకు గళం వినిపించిన దాఖలా లేనేలేదు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి ఎంతో అనుభవం ఉన్నప్పటికీ.. దానిని ఆయన వ్యక్తిగత అవసరాలకు వ్యాపారాలకు మాత్రమే పరిమితం చేసుకుంటున్నారు.
తనపై మీడియాలో యాంటీ వార్తలు వచ్చినప్పుడు మాత్రం సొంత నిధులు రెండో మూడో లక్షలు వెచ్చించి.. సేవా కార్యక్రమాల పేరిట పంచుతున్నారు. ఇంతకు మించి ఆయన ఎక్కడా స్పందించడం లేదు. అందుకే వచ్చే ఎన్నికల్లో ఆయన తన వారసుడు పోటీ చేస్తారంటూ.. ప్రకటన చేస్తున్నారు. నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డిని స్థానిక ప్రజలు చూసి మూడేళ్లు దాటిపోయిందని అంటున్నారు. ఇటు పార్టీకి కూడా అందుబాటులో లేకుండా.. ఆయన బిజీగా గడిపేస్తున్నారు.
ఇలా.. 11 మందికిపైగా ఎంపీలు.. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని పార్టీ అధిష్టా నానికి ఉప్పందింది. దీంతో వీరిని తీసేయాలా.. లేకపోతే.. అసెంబ్లీకి పంపించాలా? అని అంతర్మథనం ప్రారంభమైందట. అయితే.. ఇప్పటికిప్పుడు వీరికి టికెట్ లేదని తెలిసినా.. ఇబ్బందేనని భావిస్తున్న అధిష్టానం.. ఎన్నికలకు ముందు వరకు వేచి చూసి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates