ఆన్ లైన్ క్లాసుల కోసం ఆవును అమ్మేశాడు

మహమ్మారి వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. దాదాపుగా అన్ని రంగాలపై తన పంజా విసిరిన కరోనా…ప్రత్యేకించి విద్యారంగంపై తీవ్ర ప్రభావం చూపింది. కరోనా దెబ్బకు పరీక్షలు రాయకుండానే కొన్ని రాష్ట్రాల్లో విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. అయితే, భారత్ లో కరోనా ఉధృతి తగ్గకపోవడంతో ఇప్పటికే ప్రారంభం కావాల్సిన విద్యా సంవత్పరం ఆలస్యమైంది. మహమ్మారి తీవ్ర రూపం దాల్చనుండడంతో పాఠశాలలు, కళాశాలలు తెరవవద్దని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. ప్రభుత్వ ఆదేశాలిచ్చేవరకు ఆన్ లైన్ క్లాసులు కూడా నిర్వహించవద్దని ఆదేశించాయి. అయితే, కాసులకు కక్కుర్తి పడి….పోటీ రంగంలో నెగ్గాలనుకుంటోన్న ప్రైవేటు విద్యాసంస్థలు కొన్ని…ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి.

ఆ ఆన్ లైన్ క్లాసులు వినేందుకు విద్యార్థులకు స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్, కంప్యూటర్లలో ఏదో ఒకటి తప్పక కావాల్సిన పరిస్థితి. తోటి విద్యార్థులతో చదువుల పోటీలో తమ పిల్లలు వెనుకబడకూడదన్న ఉద్దేశంతో పేద,మధ్య తరగతికి చెందిన తల్లిదండ్రులు అప్పు సప్పు చేసి మరీ….తమ పిల్లలక ల్యాప్ టాప్ లు, స్మార్ట్ ఫోన్లు కొనిస్తున్నారు. మరి కొందరైతే తమ దగ్గరున్న వస్తువులు అమ్మి మరీ వాటిని కొంటున్నారు. తాజాగా తన పిల్లలకు స్మార్ట్ ఫోన్ కొనేందుకు తమ ఆవును అమ్మేసిన ఓ తండ్రి ఉదంతం హిమాచల్ ప్రదేశ్ లో జరిగింది.

హిమాచల్ ప్రదేశ్‌లోని కంగ్రా జిల్లాలోని జ్వాలాముఖిలో కుల్దీప్ కుమార్ తన భార్య, ఇద్దరు పిల్లలతో ఓ పూరి గుడిసెలో నివసిస్తున్నారు. ఆ పిల్లల్లో ఒకరు నాలుగో తరగతి, మరికొరు రెండో తరగతి చదువుతున్నారు. వారు చదివే పాఠశాల వారు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించడంతో….కుల్దీప్ కు స్మార్ట్ ఫోన్ అవసరం పడింది. పేదవాడైన కుల్దీప్….ఏదో ఫీచర్ ఫోన్ తో కాలం వెళ్లదీస్తున్నాడు. స్మార్ట్ ఫోన్ కొనకుంటే పిల్లలు చదువులో వెనుకబడిపోతారంటూ స్యూల్ యాజమాన్యం తేల్చి చెప్పింది. దీంతో, దిక్కుతోచని కుల్దీప్….స్థానిక బ్యాంకులో స్మార్ట్ ఫోన్ కొనేందుకు 6 వేలు అప్పు కావాలని అడిగాడు. బ్యాంకు అప్పు నిరాకరించడంతో…పాలుపోని కుల్దీప్….చివరకు తన ఆవును బేరం పెట్టాడు. పిల్లల చదువుకోసం…తమ జీవనాధరం అయిన గోమాతను అమ్మకానికి పెట్టాడు.

కుల్దీప్ పరిస్థితిని క్యాష్ చేసుకున్న దళారులు…కారు చౌకగా ఆవును కొన్నారు. ఆవును అమ్మిన డబ్బుల్లో రూ.6వేలు పెట్టి తన పిల్లలకు స్మార్ట్ ఫోన్ కొనిచ్చాడు కుల్దీప్. తనకు రేషన్ కార్టు కూడా లేదని, పంచాయతీ వారు పట్టించుకోలేదని కుల్దీప్ వాపోయాడు. కుల్దీప్ పరిస్థితి తెలుసుకన్న స్థానిక ఎమ్మెల్యే స్పందించారు. కుల్దీప్ కు తక్షణం సాయం చేయాలని అధికారులకు సూచించారు. ఈ తరహా కుల్దీప్ లు చాలామంది తమ పిల్లలకోసం ఎన్నో అష్టకష్టాలు పడుతున్నారు. ఆన్ లైన్ క్లాసుల విషయంలో ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.