టీడీపీ, వైసీపీలు ‘రాజధాని’ కాన్సెప్ట్ అమ్ముకుంటున్నాయి: పవన్

ఏపీలో అధికార వికేంద్రీకరణ, మూడు రాజధానుల అంశం, శాసన మండలి రద్దు వంటి అంశాలపై చాలాకాలంగా తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ బిల్లులకు ఏపీ శాసన సభ ఆమోదం తెలుపగా…శాసన మండలి ఆమోదం తెలపాల్సి ఉంది. తాజాగా అధికార వికేంద్రీకరణ, మూడు రాజధానుల బిల్లు ఆమోదం కోసం గవర్నర్ దగ్గరకు చేరింది. ఈ నేపథ్యంలో ఏపీలో అధికార వికేంద్రీకరణ, మూడు రాజధానులు, అమరావతి రైతుల ఆందోళన వంటి అంశాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనాడు సింగపూర్ తరహాలో రాజధాని అనే కాన్సెప్ట్ ను టీడీపీ నాయకులు అమ్మారని, అదే తరహాలో ఈనాడు అధికార వికేంద్రీకరణ అంటూ 3 రాజధానుల కాన్సెప్ట్ ను వైసీపీ నేతలు అమ్ముతున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు.

రాజధాని విషయం 33 వేల ఎకరాలు సేకరించి టీడీపీ తప్పు చేసిందని, వేల ఎకరాలను రాజధాని కోసం ఇచ్చిన రైతుల భవిష్యత్తును, రైతులు చేస్తోన్న ఉద్యమాన్ని పట్టించుకోకుండా మూడు రాజధానులంటూ వైసీపీ మరో తప్పు చేస్తోందని అన్నారు. అధికార వికేంద్రీకరణ బిల్లుకు సంబంధించి అసెంబ్లీలో తీర్మానం చేశాం కాబట్టి మండలిలో ఆమోదం అవసరం లేదని వైసీపీ నేతలు చెప్పడం సరికాదని పవన్ అన్నారు. ఏపీ విభజన జరిగినపుడు బలమైన క్యాపిటల్ కావాలని ఆంధ్రులంతా అనుకున్నారని చెప్పారు. బాంబేతో విడిపోయిన తర్వాత గుజరాత్ అభివృద్ధి చెందడానికి చాలా ఏళ్లు పట్టిందని, రెండు మూడు వేల ఎకరాలలో సువిశాలమైన రాజధాని ఏపీకి సరిపోతుందని ప్రధాని మోడీ కూడా ఆనాడు చెప్పారని పవన్ గుర్తు చేసుకున్నారు.

అయితే, రైతుల నుంచి నాటి టీడీపీ ప్రభుత్వం 33 వేల ఎకరాలు సేకరించడం అనవసరమని ఆనాడే జనసేన తరఫున తాను చెప్పానని పవన్ అన్నారు. సింగపూర్ లాంటి రాజధాని కావాలంటే అలాంటి రాజకీయ విధానం ఏపీలో లేదని చెప్పారు. అన్ని వేల ఎకరాల వ్యవసాయ భూములు తీసుకుంటే ఎప్పటికైనా ఇబ్బందేనని ఆనాడే చెప్పానని…ఈనాడు అదే మాటకు కట్టుబడి ఉన్నానని అన్నారు. గతంలోనూ రాజధాని కోసం సాగు భూములు అమ్ముకోవడం ఇష్టం లేదన్న రైతుల తరఫున తాను మాట్లాడానని గుర్తు చేశారు. టీడీపీతో ఆనాడు పొత్తు పెట్టుకున్నప్పటికీ..భూములు ఇవ్వడం ఇష్టం లేని రైతులకు తాను అండగా నిలబడ్డానని పవన్ అన్నారు.

ఏపీలో అభివృద్ధి అన్ని చోట్లా జరగాలని, కేవలం రాజధానులను విడగొడితేనే అభివృద్ధి జరుగుతుందనుకోవడం సరికాదని వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్వేశించి పవన్ వ్యాఖ్యానించారు. రాజధాని సింగపూర్ కాన్సెప్ట్ ను టీడీపీ నాయకులు అమ్మారని..అదే తరహాలో ఈసారి అధికార వికేంద్రీకరణ అని చెప్పి 3 రాజధానుల కాన్సప్ట్ ను అమ్మడం కూడా అలాంటిదేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వాన్ని నమ్మి రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారని…పార్టీలను నమ్మి ఇవ్వలేదని అన్నారు. ఆ భూముల్లో ఇపుడు వ్యవసాయం చేసుకోలేరని, ప్రభుత్వాన్ని నమ్మి రాజధాని కోసం భూమిని అమ్ముకున్నారని అన్నారు.