టీడీపీకి బలమైన నాయకులు ఉన్నారు. క్షేత్రస్థాయిలో బలమైన గళం కూడా ఉంది. మరి ఇలాంటి వారి వల్ల పార్టీకి ప్రయోజనం ఉందా? కీలక సమయంలో పార్టీని బలోపేతం చేసేందుకు వారు ఏమేరకు ప్రయత్నం చేస్తున్నారు? వారి వల్ల పార్టీ పుంజుకునేందుకు అవకాశం ఉందా? ఇవీ.. ఇప్పుడు రాజకీయంగా టీడీపీలో చర్చకు వస్తున్న ప్రశ్నలు. ముఖ్యంగా సీమ ప్రాంతంలో నందమూరి బాలకృష్ణ. అటు ఉత్తరాంధ్రలో అశోక్ గజపతి రాజు ఇలా.. కొందరు నేతలు ఉన్నారు.
వీరికి బలమైన గళం ఉంది. వారు ఏం చెప్పినా.. వారు ఏం మాట్లాడినా.. ప్రజల్లోకి బలంగా వెళ్తాయి. వారికి ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది. కానీ, వారు పార్టీకి ఏం చేస్తున్నారు? అంటే.. కొందరు మౌనంగా ఉంటున్నారు. బాలయ్య లాంటివారు.. వివాదాలకు కేంద్రంగా మారుతున్నారు. బాలయ్య అంటే.. టీడీపీ నేతగానే చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వ్యక్తిగత ఇమేజ్‌ను పక్కన పెట్టి ఆయన ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు వివాదాలకు కేరాఫ్‌గా ఉన్నాయి.
అదే సమయంలో పార్టీ పరంగా బాలయ్య ఏమైనా చేస్తున్నారా? అంటే అది ఎక్కడా కనిపించడం లేదు. ఇటీవల నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్రలో తొలిరోజు పాల్గొని కొంతమేరకు హడావుడి చేయడం తప్ప.. ఇంకేమీ పార్టీ కోసం ఆయన చేసింది లేదు. ఇక, అశోక్ గజపతి రాజు.. ఈయన కూడా అంతే. తనకు నొప్పి కలిగితేనో.. ప్రభుత్వం ఆయనపై కేసులు పెడితేనో.. ఆయన స్పందిస్తున్నారు. మీడియా ముందుకు వస్తున్నారు.
పార్టీ తరఫున ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క కార్యక్రమం చేపట్టలేదు. అదే సమయంలో యనమల రామకృష్ణుడు.. ఈయన కూడా పార్టీ అదికారంలోకి రాగానే మంత్రి పదులు దక్కించుకుంటున్నారనే వాదన ఉంది. కానీ, పార్టీ పరంగా చూసుకుంటే.. ఒక ఉద్యమం నిర్మించింది లేదు. పట్టుమని ఒక వంద మందితో సభ పెట్టింది కూడా లేదు. మరి ఇలాంటి నాయకులను చంద్రబాబు ఎందుకు ఉపేక్షిస్తున్నారు.
ఇప్పుడు ఇదంతా ఎందుకు చర్చకు వస్తోందంటే.. యువ నాయకులు ముందుండి పార్టీని నడిపిస్తున్నారు. కానీ, వారికి టికెట్లు విషయంలో హామీ దక్కడం లేదు. దీంతో పార్టీలో సీనియర్లే వారికి అడ్డు పడుతున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. అందుకే.. సీనియర్లు ఏం చేస్తున్నారనే ప్రశ్న తెరమీదికి వస్తోంది. మరి చంద్రబాబు ఈ దిశగా ఆలోచన చేస్తారో లేదో చూడాలి.