చంద్ర‌బాబుతో క‌లిసి ప్ర‌యాణించిన వైసీపీ నేత‌.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

వైసీపీ నేత‌లకు..టీడీపీ నేత‌ల‌కు ఎంత దూరం అంటే.. చాలా చాలా దూర‌మేన‌ని చెప్పాలి. పైగా ఒక‌రు ఉత్త‌రం అయితే.. మ‌రొక‌రు ద‌క్షిణం కూడా.. రెండు పార్టీ ల‌నాయ‌కులు ఎదురు ప‌డే సంద‌ర్భాలు కూడా చాలా అరుదు. అంతేకాదు.. ఒకరిపై ఒక‌రు దూష‌ణ‌లు కూడా చేసుకుంటున్న ప‌రిస్థితి పెరిగిపోయింది. అయితే.. అలాంటి స‌మ‌యంలో ఏకంగా టీడీపీ అధినేత‌, మాజీ సీఎం చంద్ర‌బాబుతో క‌లిసి ప్ర‌యాణించారు వైసీపీ నేత ఒక‌రు.

ఇది యాదృచ్ఛికంగానే జ‌రిగింది. గ‌న్న‌వ‌రం నుంచి హైద‌రాబాద్ వెళ్లే ఒక విమానంలో చంద్ర‌బాబు ప్ర‌యాణించారు. అయితే.. అనూహ్యంగా ఇదే విమానంలో వైసీపీ నాయ‌కుడు, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి షేక్ మీరావలి కూడా ప్ర‌యాణించారు. అంతేకాదు.. విమానాశ్ర‌య సిబ్బంది ఇద్ద‌రికీ కూడా ప‌క్క‌ప‌క్క‌నే సీట్లు కేటాయించ‌డంతో చంద్ర‌బాబు ప‌క్క‌నే మీరా కూడా కూర్చొని ప్ర‌యాణించారు.

అయితే.. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబుతో ఆయ‌న పిచ్చాపాటీ మాట‌లు క‌లిపారు. ఈ క్ర‌మంలో అమ‌రావ‌తి రాజ‌ధాని గురించిన చ‌ర్చ జ‌రిగింది. ఎందుకంటే.. వైసీపీ నాయ‌కుడు మీరా ఈ ప్రాంతానికిచెందిన వారే. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండలం ఊటుకూరు గ్రామానికి చెందిన వ్య‌క్తి అని తెలియ‌డంతో చంద్ర‌బాబు అమ‌రావ‌తి గురించి ప్ర‌స్తావించారు.

ఈ సందర్భంగా చంద్రబాబుతో కలిసి ఉన్న సెల్ఫీ వీడియో రికార్డ్ చేసిన మీరా వ‌లి.. తాను వైసీపీ నాయ‌కుడినేన‌ని.. అయిన‌ప్ప‌టికీ చంద్ర‌బాబు విజ‌న్‌కు మాత్రం ఫిదా అవుతాన‌ని చెప్పారు. అంతేకాదు.. అమ‌రావ‌తి డెవ‌ల‌ప్ కావాలంటే.. చంద్ర‌బాబు ముఖ్యమంత్రి కావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని మీరా వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.