రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కొందరి కుర్చీలకు వచ్చిన ఇబ్బంది లేదని పార్టీ అధినేత చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి గణనీయంగా బాగుండడం.. నాయకులు కూడా దూకుడగా పనిచేస్తుండడం ప్రజలతో మమేకం కావడం వంటి సానుకూల పరిణామాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. దీంతో సుమారు 20 నియోజకవర్గాల్లో పరిస్థితి చింతలేని విధంగా ఉంద ని పార్టీ అంచనాకు వచ్చింది.
పరుచూరు నియోజకవర్గంలో ఏలూరి సాంబశివరావు.. వరుస విజయాలు దక్కించుకుంటున్నారు. ప్రజలకు చేరువ కూడా అయ్యారు. దీంతో ఆయనకు తిరుగులేదని పార్టీ నిర్ణయించింది. మరోవైపు వైసీపీ మాత్రం ఇక్కడ ప్రయోగాల దశలోనే ఉండడం గమనార్హం. చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ను ఇక్కడకు పంపించాలని నిర్ణయించినా..ఆయన ఇప్పటి వరకు అడుగు కూడా పెట్టలేదు. దీంతో వైసీపీ మాట ఇక్కడ వినిపించడం లేదు.
ఇక, పాలకొల్లు. ఉమ్మడి పశ్చిమ గోదావరిజిల్లాలోని పాలకొల్లులోనూ.. నిమ్మల రామానాయుడు.. వరుస విజయాలు దక్కించుకున్నారు. ఇక్కడ వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు పెరిగి.. టీడీపీకి మేలు చేస్తోంది. అదే విధంగా అద్దంకి నియోజకవర్గంలోనూ గొట్టిపాటి రవికి ప్రజల్లో ఫాలోయింగ్ మరింత పెరిగింది. దీంతో ఇక్కడ మరో సారి విజయం ఖాయమనే భావన టీడీపీ లో కనిపిస్తోంది.
హిందూపురం, కుప్పం, టెక్కలి, రాజమండ్రి సిటీ, రూరల్, విశాఖ పట్నంలోని తూర్పు ఉత్తరం, దక్షిణ, పశ్చిమ నియోజకవర్గాలు కూడా మరోసారి టీడీపీకే దక్కనున్నాయి. అదే సమయంలో విజయవాడ సెంట్రల్‌లో వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని చెబుతున్నారు. కర్నూలు జిల్లాలో ఈ సారి టీడీపీ క్లీన్ స్వీప్ చేయడం తధ్యమనే అంచనాలు ఉన్నాయి. మొత్తంగా ఇప్పుడు.. 20-30 స్థానాల్లో అభ్యర్థులను మార్చాల్సిన అవసరం లేదని.. పార్టీలో చర్చ జరుగుతుండడం గమనార్హం.