టార్గెట్ కోటంరెడ్డి.. వైసీపీ యుద్ధం స్టార్ట్‌!

తాజాగా వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ స‌హా పార్టీ పెద్ద‌ల‌పై విరుచుకుప‌డ్డ సీనియ‌ర్ నాయ‌కుడు, నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డిపై వైసీపీ అధిష్టానం కూడా అదే రేంజ్‌లో దూకుడు పెంచేసింది. ఆయ‌న మీడియా స‌మావేశం ముగిసీ ముగియ‌గానే వైసీపీ అధిష్టానం ఆదేశాల‌తో నాయ‌కులు రంగంలోకి దిగిపోయారు. కోటంరెడ్డికి కౌంట‌ర్లు ఇవ్వ‌డం ప్రారంభించారు.

ఈ క్ర‌మంలో కోటంరెడ్డి ఆరోపణలపై వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. తాజాగా స‌ల‌హాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఫైర్ అయ్యారు. పార్టీలో కోటంరెడ్డికి ఏం త‌క్కువ చేశామ‌న్నారు. ఆయ‌న‌కు వ‌రుస‌గా టికెట్లు ఇవ్వ‌లేదా? అని ప్ర‌శ్నించారు. మంత్రి ప‌ద‌వులు అంద‌రూ కోరుకుంటార‌ని.. కానీ, పార్టీకి విస్తృత‌మైన ల‌క్ష్యాలు.. రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు.. వ‌చ్చే ఎన్నిక‌లు అనేక మూడు ఫార్ములాలు ఉంటాయ‌ని చెప్పారు.

కేవ‌లం మంత్రి ప‌ద‌వుల కోస‌మే ఎమ్మెల్యేలుగా పోటీ చేయ‌డం స‌రికాద‌న్నారు. కోటంరెడ్డి టీడీపీలోకి వెళ్ళటానికి నిర్ణయించుకున్న తర్వాత తీవ్ర ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. కోటంరెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం పార్టీకి కానీ, సీఎం జ‌గ‌న్‌కు కానీ ఏమీలేద‌న్నారు. ఆయనే తన ఉద్దేశాలు చెప్పిన తర్వాత చర్యలు ఏం తీసుకుంటామని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదన్నారు.

జగన్ ప్రజలను నమ్ముకుని పాలన చేస్తున్నారని స‌జ్జ‌ల వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్‌లను నమ్ముకుని ఆయ‌న పాల‌న చేయ‌బోర‌న్నారు. ఎవరైనా ఎవరికైనా ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు. పదవి రాలేదని అసంతృప్తి ఉండటం వేరని.. బహిరంగంగా ఇటువంటి ఆరోపణలు చేయటం వేరన్నారు.

నెల్లూరు రూర‌ల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ గా ఇంకా ఎవరినీ నియమించ లేదన్నారు. కొంత మందిని ఎలా లాక్కోవాలో టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలుసని సజ్జల దుయ్య‌బ‌ట్టారు. ఇక‌, ఇదే అంశంపై స్పందించిన మంత్రి గుడివాడ అమర్‌నాథ్ త‌మ ప్ర‌భుత్వానికి ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. కోటంరెడ్డి విష‌యంలో ఫోన్ ట్యాపింగ్ జ‌రిగి ఉండ‌ద‌ని.. కేవ‌లం కాల్ రికార్డింగ్ అవ్వొచ్చని అన్నారు.